Sunday, May 11, 2025
Homeజాతీయంసమగ్రంగా ఎన్నికల సంస్కరణలు

సమగ్రంగా ఎన్నికల సంస్కరణలు

- Advertisement -

– పారదర్శకతకు పట్టం కట్టాలి
– ఎన్నికల సంఘంతో సీపీఐ(ఎం) బృందం భేటీ
– పాక్షిక దామాషా ప్రాతినిధ్యం అమలుకు వినతి
– ఈవీఎంలు, అక్రమాలు, కార్పొరేట్‌ నియంత్రణ అంశాలపై చర్చ
న్యూఢిల్లీ:
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సంస్కరణలను విస్తృత సంప్రదింపులతో సమగ్రంగా చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) – సీపీఐ(ఎం) కోరింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, పొలిట్‌బ్యూరో సభ్యులు నీలోత్పల్‌ బసు, కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు మురళీధరన్‌తో కూడిన సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం శనివారం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)తో సమావేశమైంది. ఈ సందర్భంగా కమిషన్‌కు సమర్పించిన నోట్‌ను పార్టీ ప్రధానకార్యదర్శి ఎంఎ బేబీ విడుదల చేశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను చర్చలకు ఆహ్వానించాలన్న ఈసీఐ నిర్ణయాన్ని సీపీఐ(ఎం) స్వాగతించింది. రాజకీయ పార్టీలతో జరుపుతున్న ఈ సంప్రదింపులు మున్ముందు కూడా కొన ాగాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అనేక అంశాలను ఈ సందర్భంగా సీపీఐ(ఎం) ప్రస్తావించింది. ఎన్నికల సంస్కరణలు సమగ్రంగా ఉండాలని పార్టీ అభిప్రాయపడింది. ఈవీఎంలు, ఎన్నికల నిధులు, అవినీతి, కార్పొరేట్‌ నియంత్రణ, పాక్షిక దామాషా ప్రాతినిధ్యం, నిస్పాక్షికత, ఎన్నికల సంస్థల స్వతంత్ర స్వభావం, మీడియా పాత్ర వంటి అంశాలను పరిష్కరించేలా ఈ సంస్కరణలు ఉండాలని సూచించింది.
పాక్షిక దామాషా ప్రాతినిధ్యం
రాజకీయ పార్టీలు పొందుతున్న ఓట్లకు, అవి గెలుచుకున్న సీట్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. ఓట్లను గణనీయంగా పొందిన పార్టీ వాటి శాతాన్ని బట్టి సీట్లను సాధించలేకపోతోంది. అలాగే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ అధిక స్థానాలు గెలుచుకుంటోంది. 2014 ఎన్నికలలో మొదటిసారిగా బీజేపీ కేవలం 31 శాతం ఓట్లతో లోక్‌సభలో సగానికి పైగా స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 19.3 శాతం ఓట్లు సాధించినప్పటికీ కేవలం 44 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ 36.56 శాతం ఓట్లతో 240 స్థానాలలో విజయం సాధించింది. కాంగ్రెస్‌ ఓట్ల శాతం కేవలం 1.89 శాతం మాత్రమే పెరిగినప్పటికీ 2014 ఎన్నికలతో పోలిస్తే 55 స్థానాలను అదనంగా గెలుచుకుంది.
రాష్ట్రాల వారీగా ఫలితాలను పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్‌లో 2024 లోక్‌సభ ఎన్నికలలో బీఎస్పీకి 9.39 శాతం ఓట్లు వచ్చాయి. కానీ ఒక్క సీటు కూడా సాధించలేదు. కాంగ్రెస్‌ పార్టీ 9.46 శాతం ఓట్లు తెచ్చుకొని 6 స్థానాలు గెలుచుకుంది. ఒడిశాలో బీజేపీ 45.34 శాతం ఓట్లతో 20 సీట్లు గెలుచుకుంటే బీజేడీ 37.53 శాతం ఓట్లు సాధించినప్పటికీ ఒక్క సీటూ రాలేదు. 12.52 శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్‌ ఒకే ఒక సీటు గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో 39.61 శాతం ఓట్లు సాధించిన వైఎస్‌ఆర్‌సీపీ కేవలం నాలుగు ఎంపీ స్థానాలకే పరిమితమైతే దాని కంటే తక్కువగా 37.79 శాతం ఓట్లతో నాలుగు రెట్లు అదనంగా…అంటే 16 స్థానాలలో టీడీపీ విజయం సాధించింది. ఢిల్లీలో బీజేపీ 54.35 శాతం ఓట్లు తెచ్చుకొని మొత్తం ఏడు సీట్లునూ గెలుచుకోగా 24.17 శాతం ఓట్లు సాధించిన ఆప్‌ కానీ, 18.91 శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్‌ కానీ ఒక్క సీటూ గెలుచుకోలేకపోయాయి.
2024 శాసనసభ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ 39.37 శాతం ఓట్లు తెచ్చుకొని కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. తెలుగుదేశం పార్టీ దాని కంటే సుమారు 6 శాతం ఓట్లు అదనంగా పొంది ఏకంగా 135 స్థానాలు గెలుచుకుంది. కేేవలం 2.83 శాతం ఓట్లకే పరిమితమైన బీజేపీ 8 సీట్లు సాధించింది. ఒడిశాలో బీజేపీ కంటే బీజేడీకి స్వల్పంగా ఓట్లు ఎక్కువ వచ్చినప్పటికీ గెలుచుకున్న సీట్ల సంఖ్యలో చాలా తేడా కన్పించింది. బీజేపీ 78 సీట్లు సాధించగా బీజేడీకి 51 స్థానాలు మాత్రమే వచ్చాయి. చిన్న చిన్న పార్టీలు గణనీయంగా ఓట్లు తెచ్చుకున్నప్పటికీ ఒక్క సీటు కూడా పొందలేకపోయాయి. ఓట్ల శాతంలో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ సాధించిన సీట్లలో చాలా తేడా ఉంది.
ఈ అంతరాన్ని తొలగించాలంటే గతంలో లా కమిషన్‌ చేసిన ఒక సిఫారసును అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 స్థానాలను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా భర్తీ చేయాలని, దిగువసభ స్థానాల సంఖ్యను 25 శాతం పెంచి దామాషా ప్రాతినిధ్య పద్ధతిన భర్తీ చేయాలని లా కమిషన్‌ సిఫారసు చేసింది. రాష్ట్ర శాసనసభలలో కూడా ఇదే విధానాన్ని అనుసరించాలి. తొలి దశలో ఈ ప్రయత్నం చేసి, ఆ తర్వాత దామాషా ప్రాతినిధ్య పద్ధతిలో సీట్ల వాటాను పెంచాలి.
జమిలీ ఎన్నికలకు వ్యతిరేకత
ఒకే దేశం…ఒకే ఎన్నిక విధానానికి సీపీఐ(ఎం) తన వ్యతిరేకతను పునరుద్ఘాటించింది. ఈ విధానం కొన్ని రాష్ట్ర శాసనసభల పదవీకాలాన్ని తగ్గిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పతనమై శాసనసభ రద్దయితే మిగిలిన పదవీకాలానికి మాత్రమే మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. ఈ విధానం రాజ్యాంగం యొక్క ప్రాథమిక అంశాలైన ప్రజాస్వామ్యం, ఫెడరలిజంను నీరుకారుస్తుంది.
ఇతర అంశాలు
ఎన్నికల ఫలితాలను ధనబలం ప్రభావితం చేస్తోందని, డబ్బు బాగా ఖర్చు చేయగలిగే పార్టీలే ఎన్నికలలో విజయం సాధిస్తున్నాయని సీపీఐ(ఎం) ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వాలే పాక్షికంగా ఎన్నికల వ్యయాన్ని భరించాలని సూచించింది. రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయ పరిమితిని సవరించాలని కోరింది. ప్రయివేటు మీడియా ఛానల్స్‌లో రాజకీయ పార్టీలకు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు కొంత సమయం కేటాయించాలని అభిప్రాయపడింది. ఈవీఎంలు, వీవీపాట్లపై ప్రజలలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరింది. పోలింగ్‌ సమాచారాన్ని అందజేయడంలో కచ్చితత్వాన్ని పాటించాలని, జాప్యాన్ని నివారించాలని కోరింది. ఎన్నికల కమిషన్‌ జారీ చేసే ప్రవర్తనా నియమావళి, ఇతర సూచనలను రాజకీయ పార్టీలు పాటించేలా చూడాలని చెప్పింది.
ఎన్నికల హామీలు
రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీల అమలుకు నిధులు ఎలా సమకూర్చుకుంటాయో చెప్పాల్సి ఉంటుందని గతంలో ఓ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం ప్రాధాన్యతను ఇది నొక్కి చెప్పినప్పటికీ తమ విధానాలు, కార్యక్రమాలు, హామీలను ప్రజలకు స్వేచ్ఛగా వివరించడంలో రాజకీయ పార్టీలకు ఉన్న హక్కుకు భంగకరంగా ఉంది. ఇందుకోసం ఎలాంటి చట్టం తీసుకొచ్చినా వ్యతిరేకిస్తామని మేము గతంలోనే స్పష్టం చేశాము.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -