నవతెలంగాణ-హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలో రోజురోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. గాలి నాణ్యతాప్రమాణాలు దిగజారిపోతున్నాయి. అయితే ప్రస్తుతం ఆ రాష్ట్ర సమావేశాల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనలు ఉధృతం చేస్తోంది. తొలి రోజు అసెంబ్లీ సమావేశానికి ఆప్ నేతలు మాస్క్ లు ధరించి వచ్చారు. గాలి కాలుష్యానికి వ్యతిరేకంగా ముక్కుకు మాస్క్ ధరించి నిరసన తెలిపారు. తాజాగా మరోసారి అసెంబ్లీ ఎదుట ఆందోళనలు చేపట్టారు. బీజేపీ ప్రభుత్వాన్నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీలో వాయు కాలుష్యంపై చర్చించడానికి రేఖా గుప్తా ప్రభుత్వం పారిపోతుందని మండిపడ్డారు.
అధికారంలో ఉండి రేఖా గుప్తా ప్రభుత్వం బాధ్యతారాహితంగా వ్యవహరిస్తోందని, కీలక అంశంపై చర్చించకుండా బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. తీవ్ర వాయు కాలుష్యంతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ సీఎం ఆతిశీ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు శ్వాస కోసం స్టెరాయిడ్ ఇన్హేలర్లు తీసుకుంటున్నారని, AIIMS లాంటి ఆస్పత్రిల్లో అనేక మంది శ్వాసకోస వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం.. కాలుష్య సమస్య నుంచి పారిపోతోంది. ఢిల్లీలో నేడు అతిపెద్ద సమస్య కాలుష్యమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.



