– బీహార్‌లో రాజకీయ పార్టీల ట్రిక్స్
– బూత్ లెవల్ ఏజెంట్లను భారీగా పెంచుకుంటున్న పార్టీలు
న్యూఢిల్లీ : బీహార్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)తో గందరగోళం విస్తరిస్తోంది. అవసరమైన పత్రాల కోసం ప్రజలు వెతుకులాట మొదలు పెడుతుండడంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. క్షేత్రస్థాయిలో తమ ఉనికిని పెంచుకోవడం కోసం ఏజెంట్లను మోహరించడాన్ని పెంచుతున్నాయి. బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఎ)గా రాజకీయపార్టీల కార్యకర్తలు నమోదు చేసుకోవడం పెరుగుతోంది. ఈ పరిస్థితి కూడా ప్రతిపక్ష పార్టీల మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. దీనివల్ల రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు లబ్ది చేకూరవచ్చని ఆ పార్టీలు ఆశిస్తున్నాయి. జూన్ 25న ఎస్‌ఐఆర్ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో పార్టీలవ్యాప్తంగా బీఎల్‌ఎల సంఖ్య 13శాతం పెరిగింది. 1,38,680 నుంచి 1,56,625కి వీరి సంఖ్య పెరిగింది. రాజకీయ పార్టీలు ఈ బీఎల్‌ఎలను నామినేట్ చేస్తాయి.
ఇందుకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్‌కు లాంఛనంగా ఒక దరఖాస్తును పార్టీలు అందచేస్తాయి. వారు పరిశీలించి ఆ పేర్లను ఆమోదిస్తారు. బీఎల్‌ఎలు వారికి అప్పగించిన పోలింగ్ ఏరియాలో నివాసితులు లేదా నమోదైన ఓటర్లు అయి వుండాలన్నది ప్రాధమిక నిబంధన. ఈసీ పంచుకున్న డేటా ప్రకారం ఎస్‌ఐఆర్ ప్రారంభమైన జూన్ 25 నుంచి జులై 2 మధ్య కాలంలో ప్రతిపక్ష ఇండియా బ్లాక్ అదనంగా 17.51శాతం బీఎల్‌ఎలను మోహరించింది. వీరి సంఖ్య 56,038 నుంచి 65,853కి పెరిగింది. ఎన్డీఏ కూడా ఈ సంఖ్యను పెంచుకుంది. కానీ ఇండియా బ్లాక్‌తో పోలిస్తే కాస్తంత తక్కువగా 10.86శాతం పెరిగింది. అయినా మొత్తంగా వారి బీఎల్‌ఎల సంఖ్య ఇండియా బ్లాక్ కన్నా ఎక్కువగానే వుంది.
80,083 నుంచి 88,781కి పెరిగింది. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడం కోసం ఈసీ రూపొందించిన11 పత్రాల జాబితాలో చాలా పత్రాలు లేకపోవడంతో నిరుపేదలు సమాజంలో వెనుకబాటుకు గురైన వారు (మైనారిటీలతో సహా) తీవ్రంగా దెబ్బతినే అవకాశం వుంది. ఓట్ల కోసం ప్రధానంగా ఈ గ్రూపులపై ఆధారపడిన కాంగ్రెస్ దాదాపుగా బీఎల్‌ఎల సంఖ్యను రెట్టింపు చేసుకుంది. 8,586 నుంచి 1,500 వరకు బూత్ లెవల్ ఏజెంట్ల సంఖ్యను పెంచుకుంది. అంటే 92.17శాతం పెరుగుదల నమోదైంది. సహజంగానే నిబద్ధత కలిగిన కార్యకర్తలను కలిగివుండే వామపక్షాలు కూడా గణనీయంగా బూత్ లెవల్ ఏజెంట్లను పెంచుకున్నాయి. సీపీఐ(ఎం) 76మంది వున్న ఏజెంట్లను 578కి పెంచుకుంది. అంటే 660.53శాతం పెంపుదల. సీపీఐ(ఎంఎల్-లిబరేషన్) 233 నుంచి 1271కి పెంచుకుంది.అంటే 445.49శాతం మేర ఏజెంట్ల సంఖ్యను పెంచుకుంది.
ఏజెంట్ల సంఖ్యను 51,964 నుంచి 52,689కి పెంచుకున్న బీజేపీ
ఎస్‌ఐఆర్ జులై 25వరకు కొనసాగనుంది. సరిగా సగం రోజులు పూర్తయ్యేసరికి అంటే జులై 9నాటికి ఓటర్లకు పంపిణీ చేసిన ఫారాలు 57.48శాతం మేర అందుకున్నామని ఈసీ చెబుతోంది. జులై 25 నాటికి ఎవరైతే వారి ఫారాలను అందచేస్తారో వారి పేర్లను ముసాయిదా ఓటర్ల జాబితాలో చేరుస్తామని ఆగస్టు 1న ప్రచురిస్తామని ఈసీ చెబుతోంది.