నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీఆర్ఎస్ మీద కుట్ర చేస్తున్నాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో కేటీఆర్ సమక్షంలో పినపాక నియోజకవర్గం, మణుగూరుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ప్రభాకర్ రావు, ఆయన అనుచరులు బీఆర్ఎస్‌లో చేరారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ 21 నెలల పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని అన్నారు.
ప్రతి రైతూ అప్పటి రోజులే బాగుండేవని చెబుతున్నారని అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా హుస్సేన్ సాగర్ వంటివి రోజుకు రెండు నింపవచ్చని ఆయన అన్నారు. కేసీఆర్ ఆ ప్రయత్నమే చేశారని చెప్పారు. అంతటి గొప్ప కాళేశ్వరం కట్టిన కేసీఆర్‌పై సీబీఐ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ అనేది బీజేపీ జేబు సంస్థ అని రాహుల్ గాంధీ చెబుతుంటే, రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించారని విమర్శించారు.
తెలంగాణ పచ్చబడుతుంటే కొందరి కళ్లు ఎర్రబడుతున్నాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ బాగుపడుతుంటే, ప్రజలు అనుక్షణం కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటుంటే కొందరికి నచ్చడం లేదని అన్నారు. తెలంగాణలో దరిద్రం తాండవిస్తేనే తమ రాజకీయం సాగుతుందని కొంతమంది భావిస్తున్నారని విమర్శించారు.