నవతెలంగాణ-హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ధన్‌ఖడ్ అనూహ్య రాజీనామాపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసింది. అనారోగ్య కారణాలతో వైదొలుగుతున్నట్లు ఆయన చెప్పినప్పటికీ.. అది కారణం కాకపోవచ్చని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు.
ఈ మేరకు మంగళవారం ఆయన ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘ధన్‌ఖడ్ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బిజినెస్ అడ్వైజరీ కమిటీకి అధ్యక్షత వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి కిరణ్ రిజిజుతో సహా పలువురు దీనికి హాజరయ్యారు. చర్చ అనంతరం సాయంత్రం 4.30కు మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. అయితే, మరోసారి భేటీకి రిజిజు, నడ్డా రాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన ధన్‌ఖఢ్ మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. దీన్ని బట్టి నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4.30 మధ్య ఏదో పెద్ద విషయమే జరిగింది.
రిజిజు, నడ్డా ఉద్దేశపూర్వకంగానే సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈక్రమంలోనే ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ధన్‌ఖఢ్ ప్రకటించారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఇలా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దాన్ని మనం గౌరవించాలి. కానీ, అందుకు చాలా లోతైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది’ అని రమేశ్ రాసుకొచ్చారు. తన పదవీకాలంలో రైతుల సంక్షేమంపై ధన్‌ఖఢ్ నిర్భయంగా మాట్లాడేవారని రమేశ్ పేర్కొన్నారు. ప్రజాజీవితంలో న్యాయపరమైన జవాబుదారీతనం, సంయమనం గురించి గట్టిగా మాట్లాడారన్నారు. ఆయన నిబంధనలు, ప్రొటోకాల్‌కు కట్టుబడి ఉన్నారన్నారు.