– హస్తం హామీలు బూటకం
– మా హయాంలో ఎంతో అభివృద్ధి చేశార..మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే
– ఉచిత బస్సుతో ఉపయోగం లేదు
– కేంద్రం ఆపరేషన్ కగార్ ఆపాలి
– రాష్ట్రానికి అదనంగా ఒక్క పైసా ఇవ్వలేదు : బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్
నవతెలంగాణ-వరంగల్
గోల్‌మాల్ చేయడంలో, అబద్దాలు చెప్పడంలో కాంగ్రెస్‌ను మించినోళ్లు లేరని, ఆనాడయినా.. ఈనాడయినా.. ఏనాడయినా.. తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ముందుగా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వాగత ఉపన్యాసం అనంతరం కేసీఆర్ సభలో ప్రసంగించారు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అంటూ తనదైన శైలిలో రామాయణ కథతో ప్రసంగం ప్రారంభించారు. తాను ఒక్కడిగా బయల్దేరి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. 25 ఏండ్ల క్రితం తాను పార్టీ పెట్టినప్పుడు ఎంతోమంది ఎగతాళి చేశారని గుర్తు చేశారు. అయినా ప్రజాభిమానంతో గులాబీ జెండా రెపరెపలాడుతుండగా.. తెలంగాణ సాధించామని చెప్పారు. అనంతరం పదేళ్ల పాటు తెలంగాణను పాలించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను నంబర్‌వన్ చేశామన్నారు. ఆనాడు పదవుల కోసం టీడీపీ, కాంగ్రెస్ వాళ్లు పెదవులు మూశారని, తాము మాత్రం.. పదవులను త్యాగం చేసి రాష్ట్రం కోసం నిలబడ్డామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మోస పూరిత హామీలతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పరిస్థితి చూస్తుంటే బాధ, గోస కలుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా రెండున్నరేండ్ల సమయం మాత్రమే ఉందని, ఆలోపు వీరి మోసాలను ఎండగట్టాలన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.90 వేల నుంచి రూ.3.5లక్షలకు పెంచామన్నారు. జీఎస్‌డీపీ సైతం పెరిగిందన్నారు. ఎన్నో ప్రాజెక్ట్‌లను నిర్మించి రైతులకు సాగు నీరు అందించామని తెలిపారు. చెక్‌డ్యామ్‌లు నిర్మించామని, మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయడంతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం పండించామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. తనను ఎవరు అడగకున్నా.. రైతు బంధు అమలు చేశామని, సీజన్ ప్రారంభం కాగానే రైతుల అకౌంట్లలో డబ్బులు పడేవని చెప్పారు. అలాగే రైతుబీమా అమలు చేసి, రైతులు చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందజేశామన్నారు. ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశామని తెలిపారు. అధికారంలోకి వస్తే పింఛన్లు, రైతు బంధు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు అమలు చేసిందా అని ప్రశ్నించారు. విద్యార్థులకు స్కూటీలు, ఇంట్లో ఇద్దరికి పింఛన్లు ఇస్తామని చెప్పారని, రైతు రుణమాఫీ ఇలా ఎన్నో హామీలు ఇచ్చి.. అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. దేవుళ్ల మీద ఓట్లు పెట్టడం తప్పా కాంగ్రెస్ చేసిందేమీ లేదని తెలిపారు. తాము ఉచితంగా నాణ్యమైన కరెంట్ ఇచ్చామని.. ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పథకాలతో ఒరిగిందేమీ లేదు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పెట్టిన ఉచిత బస్సు పథకంతో ఉపయోగం లేదన్నారు. దాంతో జుట్లు పట్టుకొని కొట్టుకోవడం తప్పా ఉపయోగమేమీ లేదన్నారు. ఆ పథకం వద్దని మహిళలే అంటున్నారని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పరిస్థితిని ఆగం చేసిందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణలో భూముల ధరలు అధికంగా ఉండేవని.. నేడు ధరలు పడిపోయాయని తెలిపారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్‌కు సమయం ఇవ్వడానికే తాను ఇన్ని రోజులు బయటకు రాలేదని అన్నారు. ఏడాదిన్నర అయిపోయిందని, ఇంకెప్పుడు పనులు చేస్తారన్నారు. ఈ రోజు హెచ్‌సీయూ భూములు అమ్ముతున్న కాంగ్రెస్.. రేపు ఉస్మానియా భూములు కూడా అమ్ముతుందన్నారు. రాష్ట్రాన్ని నడపడం చేతగాని కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే భూముల రేట్లు తగ్గాయని, రియల్ ఎస్టేట్ రంగం దివాళా తీసిందని, భూములు అమ్ముదామన్నా.. కొనేవారు లేరని వ్యాఖ్యానించారు.
రాసిపెట్టుకోండి.. మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే
మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అంటూ కేసీఆర్ పోలీసులను హెచ్చరించారు. కాంగ్రెస్ చెప్పినట్టు తమ కార్యకర్తలపై కేసులు పెట్టడం, ప్రస్తుతం సభను అడ్డుకోవడానికి పోలీసులు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా చేస్తున్న పోలీసులు తమ డైరీలో రాసుకోవాలని.. వచ్చేది తమ ప్రభుత్వమేనని, అప్పుడు వారి లెక్క తేలుస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు నిత్యం బీఆర్‌ఎస్ మీద నిందలు వేయడం తప్ప చేసిందేమి లేదన్నారు. నాడు వైఎస్ హయాంలో ఆరోగ్య శ్రీ పథకం తెస్తే అది బాగుండటంతో దాన్ని తమ ప్రభుత్వ హయాంలో అలాగే కొనసాగించామన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తోందన్నారు. ప్రస్తుతం రజతోత్సవ సభ పెట్టుకుంటే అనేక అడ్డంకులు సృష్టించారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కమీషన్ల ప్రభుత్వం నడుస్తోందని కేసీఆర్ ఆరోపించారు.
20 శాతం కమీషన్లు ఇస్తే కానీ బిల్లులు ఇవ్వడం లేదన్నారు. కమీషన్లు తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ ఎదుట ధర్నా చేశారని గుర్తు చేశారు. ప్రజల వెంట బీఆర్‌ఎస్ ఉంటుందన్నారు.
ఆపరేషన్ కగార్‌తో ఎన్‌కౌంటర్లు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసింది శూన్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేస్తోందన్నారు. ఎంతో మంది అమాయక గిరిజనులను చంపేస్తోందన్నారు. నక్సలైట్లు చర్చలకు సిద్ధమని ప్రకటించారని, వారితో మాట్లాడి సమస్య పరిష్కరించాలన్నారు. వెంటనే ఎన్‌కౌంటర్లు ఆపాలని కోరారు. ఈ మేరకు కేంద్రానికి బీఆర్‌ఎస్ తరఫున లేఖ రాస్తామన్నారు. రాష్ట్రానికి ఆదనంగా ఒక్క పైసా ఇవ్వలేదు. తాము ప్రభుత్వాన్ని పడగొట్టమని అన్నారు. ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే ప్రజలే కాంగ్రెస్ వీపు పగులకొడతారన్నారు. తమకు ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం లేదన్నారు.
కాంగ్రెస్సే విలన్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES