Tuesday, December 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహరీశ్ రావుపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో త్వరలో పెను సంచలనం జరగబోతోందంటూ టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు చేతిలోకి తెలంగాణ బీజేపీ రిమోట్ కంట్రోల్ వెళ్లిపోయిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. హరీశ్ రావు చేతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలుబొమ్మలుగా మారిపోయారని సామ విమర్శించారు. ఇకపై కేటీఆర్ కార్యక్రమాల కంటే ఎక్కువగా హరీశ్ రావు కార్యక్రమాలకు ప్రచారం కల్పించేలా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు. హరీశ్ రావు, ఈటల రాజేందర్ పన్నిన వ్యూహంలో బీజేపీ చిక్కుకుపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.

సామ రామ్మోహన్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో హరీశ్ రావు బీజేపీలో చేరతారనే ఊహాగానాలకు మరోసారి బలం చేకూరినట్లయింది. గతంలో కూడా పలుమార్లు ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగింది. అయితే, ఆ వార్తలను హరీశ్ రావు ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం బీఆర్ఎస్‌లోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఇటీవల బీఆర్ఎస్ నుంచి సస్పెండైన ఎమ్మెల్సీ కవిత కూడా హరీశ్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. హరీశ్ బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారని ఆమె పరోక్షంగా సూచిస్తూ, ఆయన విషయంలో కేసీఆర్, కేటీఆర్‌ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత చేసిన తాజా ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -