నవతెలంగాణ-హైదరాబాద్: ఓట్ చోరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ మరో పోరాటానికి సిద్ధమవుతోంది.దేశరాధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో డిసెంబర్ 14న భారీ ర్యాలీ నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణను ఈ సభలో హైలైట్ చేయనుంది. కాంగ్రెస్ ‘మహా ర్యాలీ’ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వివరిస్తూ, డిసెంబర్ 14వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని చెప్పారు. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కమ్మేస్తున్న అతిపెద్ద ప్రమాదం ఓట్ చోరీ అని, దేశ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా రామ్‌లీలా నుంచి గట్టి సందేశాన్ని ప్రజల్లోకి పంపుతామని తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర ఓటర్ల జాబితా సవరణ సర్వే(సర్)ను వ్యతిరేకిస్తూ ఈ ఏడాది ఆగష్టులో బీహార్‌లో ఓట్ అధికార్ యాత్రను రాహుల్ గాంధీ చేపట్టిన విషయం తెలిసిందే. ఆర్జేడీతో కలిసి బీహార్ వ్యాప్తంగా యాత్ర నిర్వహించి..సర్ పేరుతో ఈసీ ఓటు చోరీ వ్యవహారంపై ప్రజలకు అవగాహన కల్పించారు. బీజేపీతో కలిసి ఈసీ ఓటు చోరీకి పాల్పడుతుందని బహిరంగంగా విమర్శించారు. హర్యానా, రాజస్థాన్, మహరాష్ట్రాల్లో బీజేపీ ఓట్ల చోరి ద్వారా అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు.



