నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మిర్యాలగూడ మండలం గూడూరులో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవ’ సభలో సీఎం ప్రసంగించారు. ‘‘రేషన్ కార్డుల కోసం గతంలో పదేండ్ల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణలో 3.17 కోట్ల మందికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నాం. బియ్యం వచ్చిన వారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. వరి ఉత్పత్తిలో మిర్యాలగూడ ఆసియాలోనే ముందుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలి. ఎన్నికల్లో మా విజయాన్ని అడ్డుకోలేరు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ బీఫాం మీద పోటీ చేస్తున్న ఆడబిడ్డలకు కూడా ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాం.
రైతు రుణమాఫీ కింద 25.35 లక్షల మందికి రూ.21 వేల కోట్లు ఖర్చు చేశాం. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తున్నాం. రైతు భరోసా కింద రూ.6వేల చొప్పున రూ.9వేల కోట్లు ఇచ్చాం. మున్సిపల్ ఎన్నికలు ముగిశాక రైతు భరోసా నిధులు జమ చేస్తాం. దేశంలో అత్యధికంగా రైతుల కోసం రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేశాం. ఏప్రిల్‌లో కొత్త బడ్జెట్‌లో లక్షలాది ఇళ్లు పేదలకు ఇస్తాం. పేదల ఆత్మగౌరవం పెంచే బాధ్యత తీసుకుంటాం. నల్గొండ జిల్లాపై కోపంతో ఎస్‌ఎల్‌బీసీని పక్కనపెట్టారు. ఎస్‌ఎల్‌బీసీ ఆగిపోతే మామ, అల్లుళ్లు దావతు చేసుకున్నారు. నల్గొండ ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లు తాగడానికి కారణం బీఆర్‌ఎస్. రెండేళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో ఎస్‌ఎల్‌బీసీ పనులు చేపట్టాం. కేసీఆర్‌కు పోలీసులు నోటీసు ఇస్తే.. తెలంగాణ జాతికి ఇచ్చినట్టు చెబుతున్నారు’’ అని సీఎం విమర్శించారు.


