Sunday, July 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబీహార్‌లో మైనార్టీల ఓట్ల తొలగింపునకు కుట్ర

బీహార్‌లో మైనార్టీల ఓట్ల తొలగింపునకు కుట్ర

- Advertisement -

జీవో నెం.49 పూర్తిగా రద్దు చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ – ఆత్మకూరు

దేశంలో ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ.. బీహార్‌లో మైనార్టీల ఓట్ల తొలగింపునకు కుట్ర పన్నుతున్న బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రజలు వ్యతిరేకించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. వనపర్తి జిల్లా అమరచింత పట్టణంలో శనివారం నిర్వహించిన సీపీఐ(ఎం) రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన హాజరయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. బీహార్‌ ఎన్నికల్లో మైనార్టీలు ఓట్లు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. ఆ రాష్ట్రంలో బెంగాలీ మైనార్టీలు ఉన్నారని, వారు స్థానికులు కాదని 52 లక్షల ఓట్లు తొలగించేందుకు బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. ఆ రాష్ట్రంలో బీజేపీ కూటమి ఓడిపోయే అవకాశం ఉన్నందున ఓటర్లను తగ్గించాలని చూస్తోందన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. ఓట్ల తొలగింపుపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు నిలదీస్తున్నా కేంద్రం సమాధానం చెప్పడం లేదని అన్నారు. అందుకు ప్రతిపక్షాలందరూ కలిసి ఆగస్టు 8న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు.రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీ రిజర్వేషన్లలో ముస్లింలు కూడా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దీనిని వ్యతిరేకిస్తూ మాట్లాడారని అన్నారు. ముఖ్యమంత్రి కేవలం కేంద్ర ప్రభుత్వ నాయకులకు వినతిపత్రాలు ఇవ్వడమే కాకుండా అఖిలపక్ష నాయకులను ఐక్యం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు.

జీవో నెంబర్‌ 49ను పూర్తిగా రద్దు చేయాలి
మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో జీవో నెంబర్‌ 49ను తీసుకొచ్చి అటవీ ప్రాంతం నుంచి ఆదివాసీలను ఖాళీ చేయించే కుట్ర జరుగుతోందని జాన్‌వెస్లీ తెలిపారు. ఆదివాసీలను తరిమేసి.. దాదాపు మూడు, నాలుగు లక్షల ఎకరాల భూమిని కార్పొరేట్‌ శక్తులకు అప్పజెప్పాలని కేంద్రం ఆలోచిస్తోందని అన్నారు. జీవో 49ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, అమరచింత మండల కార్యదర్శి గోపి, నాయకులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -