నవతెలంగాణ-హైదరాబాద్: ఓ పోలీస్ కానిస్టేబుల్ కాస్ట్‌లీ ఫోన్ కోసం దొంగగా మారిపోయాడు. షాపులోని సీసీటీవీ కెమెరాల ఆధారంగా అడ్డంగా దొరికిపోయాడు. ఉత్తర్ ప్రదేశ్ జౌన్‌పూర్‌లోని లైన్ బజార్‌లో ఉన్న మొబైల్ షాప్‌కి.. గత శనివారం ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఆ షాపులోకి వచ్చారు. తమకు కాస్ట్‌లీ ఫోన్లు చూపించమని సేల్స్ గర్ల్‌కు కోరారు. ఆమె కొత్త కొత్త మోడల్స్ తీసి వారి ముందు పెట్టింది. వారు ఆ ఫోన్లను చేతుల్లోకి తీసుకుని చెక్ చేయసాగారు. కొద్దిసేపటి తర్వాత సేల్స్ గర్ల్ ఫోన్ మాట్లాడటంలో బిజీ అయిపోయింది.
ఇదే అదునుగా భావించిన ఓ కానిస్టేబుల్.. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ను జేబులో పెట్టేసుకొని అక్కడినుంచి వెళ్లిపోయారు. డిస్ ప్లేలో ఉంచిన 1.6 లక్షల రూపాయల ఐఫోన్ కనిపించకపోవటంతో షాపు యజమాని శివమ్‌కు అనుమానం వచ్చింది. వెంటనే సీసీటీవీ ఫుటేజీ చూశాడు. అందులో కానిస్టేబుల్ ఐఫోన్ దొంగతనం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.
శివమ్ నేరుగా ఎస్పీ ఆఫీస్‌కు వెళ్లి సదరు కానిస్టేబుళ్లపై ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజీలను ఆయనకు చూపించాడు. ఎస్పీ ఆదేశాల మేరకు ఇద్దరు కానిస్టేబుళ్లపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కానిస్టేబుల్ దొంగతనం చేసిన ఫోన్‌ను శివమ్‌కు తిరిగి ఇచ్చేశారు. ఎస్పీ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.



