Sunday, July 20, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిభారత రాజ్యాంగం - లౌకికతత్వం

భారత రాజ్యాంగం – లౌకికతత్వం

- Advertisement -

”దేవుడు చచ్చిపోయాడు. దేవుడ్ని మనమే చంపేశాం. కాని ఆయన నీడ మాత్రం మనల్ని భయపెడ్తూనే ఉంది” అంటాడు ఫ్రీడ్రిచ్‌ నీట్జ్‌. దాదాపు 66 రాజ్యాంగాలు తమ పీఠికలో ‘భగవంతుడి’ ప్రస్తావన చేస్తాయి. భారత రాజ్యాంగం లౌకికబాట పట్టడానికి నెహ్రూనే కీలక పాత్రధారి. ”భీతికొల్పే రీతిలో సంఘటితమైన మతం మూఢ విశ్వాసాలకు, మతాంధతకు దారితీస్తుందని, అది దోపిడీకి కూడా కారణమవుతుంద”ని తన ఆత్మకథలో నెహ్రూ రాసుకున్నారు. మతం అవసరం రాజకీయాల కొస్తుందని ఆయన ఆనాడు ఊహించలేదు.

లౌకికవాదమంటే ఫ్రాన్స్‌లోలాగా రాజ్యం నుండి మతాన్ని స్పష్టంగా విడగొట్టడమో, అమెరికాలాగా మత సంస్థల స్థాపనోకాదని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. ఎమర్జెన్సీలో సెక్యులర్‌ అనేమాట కృత్రిమంగా చేర్చారనిగానీ, దాన్ని తీసెయ్యాలనే డిమాండ్‌గానీ చాలాకాలంగా మన దేశంలో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. కాని భారతదేశ లౌకికతత్వం అశోక చక్రవర్తి కాలంనాటి ‘దమ్మా’ల్లోనూ, భారత జాతీయోద్యమ పోరాట ఉన్నత ఆశయాల్లోనూ ఉంది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51ఎ(బి) ప్రకారం ”జాతీయోద్యమ లక్ష్యాలను సమున్నతంగా నిలపడం ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యం” అదీ లౌకికతత్వమంటే!

లౌకికవాదం స్వయంప్రతిపత్తినిస్తుంది
లౌకికవాదం వల్ల మైనారిటీలు ప్రత్యేక సౌకర్యాలను అనుభవిస్తున్నారని హిందూత్వవాదం భావన. దాన్ని రద్దు చేయటం ద్వారా మత సంబంధ విషయాల్లో రాజ్యాన్ని తటస్థం చేయొచ్చని వారనుకుంటున్నారు. దురదృష్టవశాత్తూ మత రాజ్య స్థాపన కోసం వెంపర్లాడే వారు అర్థం చేసుకోని విషయమేమంటే లౌకికతత్వమే మత సంబంధ వ్యవహారాల్లో రాజ్య జోక్యం నుండి రక్షిస్తుంది. ఈ విషయం వారికి తెలియటం లేదు. మతాలు స్వతంత్రంగానూ, స్వయం ప్రతిపత్తితో ఉండేది లౌకిక వ్యవస్థలోనే. మత రాజ్యాల్లో రాజ్యం మతాన్ని నియంత్రిస్తుంది.
హిందూత్వవాదులు అర్థం చేసుకోవల్సిన విషయమేమంటే మన దేశం లౌకిక వ్యవస్థలో ఉండటమే హిందూ మతం యొక్క స్వయంప్రతిపత్తిని కాపాడుతుంది. ఇస్లామిక్‌ రాజ్యాలుగా చెప్పబడే వాటివల్లే ఇస్లాం నాశనం అవడం మనం చూస్తున్నాం కదా!
మహ్మద్‌ ఘజ్నీ, ఇల్తుత్మీష్‌లు ప్రవక్త వారసత్వాన్ని ధిక్కరించి తమకు తాము చక్రవర్తులుగా ప్రకటించు కోలేదా? మధ్యయుగ భారతదేశంలో ఈ చక్రవర్తులు తయారుచేసిన జనాబత్‌ చట్టాలే షారియా చట్టం కన్నా ప్రధానంగా మారినాయి కదా! పోప్‌ అధికారాన్ని కాదని 8వ హెన్రీ రాజు అన్నే బోలియిన్‌ను పెండ్లాడి రాజే అధిపతిగా ఆంగ్లికన్‌ చర్చి సృష్టించలేదా? 2024లో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా శంకరాచార్యుల మత సంబంధ విషయాలకంటే రాజ్య నిర్ణయమే కదా చెలామణీ అయ్యింది? ఇక్కడ మతం కాదు శుభముహూర్తం నిర్ణయించింది, రాజ్యమే!

ఆధునిక రాజ్యం ఆత్మకు మోక్షం ప్రసాదిం చడం తప్పనిసరి చేసిందా? లేదంటున్నారు 1689 నాటి లేఖలో (ఎ లెటర్‌ కన్సర్నింగ్‌ టాలరేషన్‌) ఆనాటి బ్రిటన్‌ రాజకీయ సిద్ధాంత వేత్త జాన్‌ రాకీ. ఎందుకంటే పౌర హక్కులను ‘రక్షించడం, ముందుకు కొనిపోవడం’ లక్ష్యంగా ఇక్కడ రాజ్యం ఉనికిలోకి వచ్చింది. రాజ్యం ఒక బాహ్య, భౌతిక విషయం. మతం మనిషి యొక్క అంతరంగిక జ్ఞాన సముపార్జనకు సంబంధించిన విషయం. ఇక్కడ ఆత్మలకు సంబంధించిన విషయం రాజ్యానికి ఒప్పగించబడలేదని వాదిస్తాడాయన.
18వ శతాబ్దంలో లౌకికవాదం గెలవడానికి కారణం ఆ కాలంలో మతంపై హేతువు గెలవడమే. లౌకికవాదం ఆధునిక కాలపు ఆలోచన కాగా, లౌకికవాద వ్యతిరేకత, మత సంబంధ రాజ్యానికి చెందిన ఒక గతకాలపు ఆనవాలు. ఆధునికతలో మనం విసుగు చెందితే సౌదీ అరేబియాలాగానో, ఇరాన్‌లాగానో, పాకిస్థాన్‌లాగానో మన దేశం మారాలా? మన దేశంలోని అత్యధికమంది హిందువులు ఆ విధంగా కోరుకోవటం లేదు.

అశోకుని కాలం నాటి శాసనాల ప్రాధాన్యత
మూల రాజ్యాంగంలో లౌకిక అనే మాట లేదు కాబట్టి లౌకికతత్వాన్ని వ్యతిరేకించడం సరైందేనా? భారత రాజ్యాంగం 1976లోనే లౌకికంగా మారిందనడం శుద్ధ అబద్ధం. క్రీస్తుపూర్వం 268-232 మధ్యన మన దేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తి అశోకుడు. లౌకికతత్వం ఆనవాళ్ళు కూడా ఆయన పాలన కాలం నుండే తెలుసుకోవచ్చు.
ఆయన కాలం నాటి శాసనాలపై విస్తృతంగా అధ్యయనం చేసిన రాజీవ్‌ భార్గవ వాటి ప్రాముఖ్యాన్ని వివరించారు. ఏదేనీ ఒక మతం రాజ్యమతంగా ఉండటాన్ని శిలా శాసనం-7 వ్యతిరేకిస్తూ ”అన్ని మతాలు అన్ని చోట్ల ఉండాలి” అన్నది. ఎందుకంటే అన్ని మతాలూ స్వయం నిగ్రహాన్ని, హృదయ పవిత్రతను కోరుకుంటాయి. నేటి భారతదేశంలో అతి పెద్ద సమస్య విద్వేష ప్రసంగాలు. (అశోకుని) 12వ శిలా శాసనం ”ఒక మతాన్ని కీర్తించి, మిగిలిన మతాన్ని తెగనాడకూడద”ని స్పష్టీకరించింది. అశోకుని ‘దమ్మాలు’ మతం కావు. అవి కొన్ని పాలనా సూత్రాలు. అంటే రాజు అవలంబించాల్సిన సదాచార పరాయణత్వం, నైతికత గురించి పేర్కొన్నాయి. వివిధ మతాల సహజీవనం మాత్రమే కాదు. పరమత సహనానికి మించిన అంశాలు అశోకుడి పాలన అమలు చేసింది.

రాజ్యాంగ రచన ప్రాథమికంగా చేసిన మోతీలాల్‌ నెహ్రూ కమిటీ ముసాయిదా ప్రతిలో 4(11) ”భారతదేశానికిగాని, ఏదైనా రాష్ట్రానికి (ప్రావిన్స్‌)కుగాని రాజ్య మతం ఉండదు. రాజ్యం ప్రత్యక్షంగాగాని, పరోక్షంగాగాని ఏ మతానికీ ఆ అవకాశం ఇవ్వదు” అని రాయబడి ఉంది. భవిష్యత్‌ స్వరాజ్య భారతం ఎలా ఉండాలో చెప్పింది 1931లో (కరాచీ) జరిగిన కాంగ్రెస్‌ మహాసభ. ఆ మహాసభ ఆమోదించిన 2(9) తీర్మానంలో ”వివిధ మతాలకు సంబంధించిన విషయాలపై రాజ్యం తటస్థంగా ఉంటుంది” అని పేర్కొంది. వి.డి. సావర్కార్‌ ఆశీస్సులతో హిందూ మహాసభ 1944లో రూపొందించిన ముసాయిదా రాజ్యాంగంలో 7(15) అధికరణంలో రాజ్యానికిగాని, ఏదైనా ప్రావిన్స్‌కుగాని మతముండదని స్పష్టీకరించింది. మరి సావర్కార్‌ చెప్పిన దాన్ని కూడా మనం నేడు ఎందుకు తిరస్కరిస్తున్నాం?
రాజ్యాంగ సభలో అక్టోబర్‌ 17, 1949 నాడు ముసాయిదా రాజ్యాంగంపై చర్చ జరిగే సందర్భంగా హెచ్‌వి కామత్‌ ”పీఠికలో దేవుని దయతో ప్రారంభం కావాలని ప్రతిపాదించాడు. ఇంత మతాచారాలున్న దేశంలో ”దేవుడి దయవల్ల” దేవుడికి 17 ఓట్లే వచ్చాయి. ఆ ప్రతిపాదన వీగిపోయింది. ఆ విధంగానే ‘లౌకిక’ అనేమాట ప్రత్యేకంగా ఎవరూ ప్రతిపాదించలేదు. శ్యామప్రసాద్‌ ముఖర్జీతో సహా ఎవరూ ‘హిందూ రాష్ట్ర’ అనే ప్రతిపాదన తీసుకురాలేదు. 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు మన దేశ మవుళిక లక్షణంగా లౌకికతత్వం ఉండాలన్నది. మన రాజ్యాంగం మాట్లాడని కొన్ని మాటలు, ఉదాహరణకు ఫెడరల్‌, న్యాబద్ధ సమీక్ష (జ్యుడీషియల్‌ రివ్యూ) వంటివి చాలా ప్రధానమైనవి. కాని ఇవన్నీ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో అంతర్భాగంగానే చూడబడుతున్నాయి.

అధికార పరిధి నమూనా (జ్యూరిస్‌డిక్షన్‌ మోడల్‌)
లౌకికవాదమనేదే ‘విడగొట్టే నమూనా’ అని ప్రచారం చేసేవారు ‘అధికార పరిధి’ నమూనాను పరిశీలించండి. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లో అనేక అభిలషణీయ రూపాలున్నాయి. హిందూత్వ కాకుండా, హిందూయిజమే మన రాజ్యాంగ ప్రధాన ఆధ్యాత్మిక వారసత్వ సంపదని ప్రకటించవచ్చు. ఇంగ్లండులో ఆంగ్లికన్‌ చర్చే ప్రధాన చర్చి. ఆ దేశ రాజు ఆ మతాన్ని రక్షించే వ్యక్తిగా ఉంటాడు. అదే సమయంలో ప్రజలందరికీ వారి వారి మతాన్ని నమ్మే హక్కు, ఆచరించే హక్కు ఆ దేశంలో ఉంది. అక్కడ ఏ మతం యెడలా వివక్ష పాటించడానికి వీల్లేదు. ఐర్లాండ్‌ రాజ్యాంగ పీఠిక ప్రారంభమే అతి పవిత్రమైన త్రిమూర్తి (మోస్ట్‌ హౌలీ ట్రినిటీ)తో ప్రారంభమవుతుంది. కాని ఏ మతంపట్ల వివక్ష చూపడానికి వీల్లేదు. ఆ దేశంలో ఏ మతమూ రాజ్య మతం కాదు. గ్రీస్‌ రాజ్యాంగంలోని 3వ అధికరణం ప్రకారం గ్రీక్‌ ఆర్థడాక్స్‌ చర్చే ప్రధాన మతంగా ఉన్నా ఏ మతం యెడలా వివక్ష ప్రదర్శించడానికి వీల్లేదు. 5(2) అధికరణం జీవించే హక్కునిస్తుంది. మత విశ్వాసాల ఆధారంగా వివక్ష ప్రదర్శించరాదు. పశ్చిమ థ్రేస్‌లో ముస్లిమ్‌లు మత, న్యాయ సమస్యల పరిష్కారానికి అధికారిని ఎన్నుకునే హక్కు కలిగి ఉన్నారు. ముస్లింలు షారియా చట్టంగాని, సివిల్‌ కోర్టులుగాని ఏది కావాలంటే దాని ద్వారా వివాదాలు పరిష్కరించుకునే అవకాశం కలిగి ఉన్నారు. పాకిస్థాన్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 2 ప్రకారం ఇస్లామ్‌ ఆ దేశ రాజ్య మతం. ఇతర మతాల వారు ఆ ఆ దేశ అత్యున్నత రాజ్యాంగ పరిధికి అనర్హులు. కాని ఆ దేశ మైనారిటీలు వారి మత సాంప్రదాయాలు పాటించే హక్కు కల్గి ఉన్నారు.

మన దేశ లౌకికతత్వం అశోకుడి ‘దమ్మం’పై ఆధారపడి వుంది. ప్రజలు నాగరిక సూత్రాలపై ఆధారపడి కలిసిమెలిసి ఉండేలా, అన్ని మతాల్ని సమానంగా చూసేలా ఈ ‘దమ్మం’ ఉంది. రాజ్యం మతాల యెడల తటస్థంగా ఉండాలి. రాజ్యం మతానికి దూరంగా ఉండాలనే అంశంపై మనం పాకిస్థాన్‌ను వ్యతిరేకించాలి. మన రాజ్యాంగ నిర్మాతలు లౌకిక రాజ్యాన్నే కోరుకున్నారుగాని, మత రాజ్యాన్ని కాదు. మొదటి నుండి లౌకిక రాజ్యమే మన లక్ష్యంగా ఉంది. దాన్ని బహిరంగంగా 1976లో ప్రకటించారు.
(రచయిత రాజ్యాంగ నిపుణులు)
ఆయన అభిప్రాయాలను యథాతథంగా..
స్వేచ్ఛానువాదం : ఆరెస్బీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -