‘మన రాజ్యాంగం గొప్పతనం అనేది దానిని అమలు చేసే పాలకుల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది. దీని అమలులో పాలకులు వైఫల్యం చెందితే ప్రజలు తిరుగుబాటు చేస్తారు.’ రాజ్యాంగ నిర్ణాయక చివరి సభలో అంబేద్కర్ స్పష్టంగానే చెప్పారు. ప్రధాని ఆర్థిక సలహా మండలి అధ్యక్షుడు వివేక్ దెబ్రాయ్ ఓ జాతీయ పత్రికకు రాసిన వ్యాసంలో ‘ప్రస్తుత రాజ్యాంగం పరిపాలనకు అడ్డంకిగా ఉంది, దీనిని మార్చేసి 2047 కల్లా కొత్త రాజ్యాంగం రూపొందించుకోవాలి’ అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి అంతరంగికుడైన వివేక్ దెబ్రాయ్ ప్రధాని మనసులో లేని మాటలు మాట్లాడే సాహసం చేయగలరా? రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఈ ”బుద్దిజీవుల” చిత్త శుద్ధి ఏపాటిది?
స్వాతంత్య్రోద్యమ లక్ష్యాలు, ప్రజల ఆకాంక్షలు, భిన్నత్వాన్ని ప్రతిబింబించే విధంగా భారత రాజ్యాంగ నిర్మాణం జరిగింది. దేశాన్ని భిన్న జాతుల సమ్మేళనం(యూనియన్ ఆఫ్ ఇండియా)గా రాజ్యాంగం పేర్కొంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం రాజ్యాంగ మౌలిక లక్ష్యాలుగా ప్రకటించబడ్డాయి. పౌరుని ప్రాథమిక హక్కులు చట్టబద్ధం చేయబడ్డాయి. పౌరసత్వానికి కులం, మతం, భాష, లింగంతో సంబంధం లేదని రాజ్యాంగం స్పష్టం చేసింది. ఆదివాసులు, వెనకబడిన ప్రాంతాల ప్రజల భూమికి రక్షణలు కల్పించింది. దళితులు, ఆదివాసీలకు విద్య, ఉద్యోగం, చట్టసభల్లో తగు ప్రాతినిధ్యాలకు రిజర్వేషన్ల కల్పించింది. అలాంటి రాజ్యాంగాన్ని చడీచప్పుడూ లేకుండా ఇష్టానుసారం ఉల్లంఘించడం, ఎద్దేవా చేయడం ఈ ”పరివారానికి” కొత్తేమి కాదు.
స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ అవకాశం దొరికినప్పుడల్లా రాజ్యాంగాన్ని తూర్పారపడ్తూనే ఉంది. గోల్వార్కర్ దగ్గర నుంచి ప్రస్తుత బీజేపీ నాయకులందరూ రాజ్యాంగాన్ని కించపరుస్తూనే ఉన్నారు. ఇప్పుడూ అదే పనిలో ఉన్నారు. ప్రధానమంత్రి మోడీకి సైతం అందులో మినహాయింపేమిలేదు! స్వాతంత్య్రం రావడానికి ఒక్క రోజు ముందు విడుదలైన వారి అధికార పత్రిక ”ఆర్గనైజర్”లో అసలు మన జాతి నిర్మాణాన్నే తూలనాడారు. హిందుస్థాన్ హిందువులది మాత్రమేనన్నది వారి ప్రగాఢ నమ్మకం. ఆ పునాదులపైనే జాతి నిర్మించాలని వారి అభిలాష.
రాజ్యాంగాన్ని పునర్లిఖించాలన్న ఆలోచన కేవలం వివేక్ దెబ్రారుదే కాదు. వాజపాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే అందుకు న్యాయమూర్తి ఎం.ఎన్.వెంకటాచలయ్య నాయకత్వంలో ఓ కమిటీ వేయడం… అది నివేదిక కూడా ఇవ్వడం వేగంగానే జరిగాయి. అయితే అప్పుడు ఆ సిఫార్సులను అమలు చేయలేదు. వివేక్ దెబ్రారు ప్రధాన వాదన ఏంటంటే ప్రస్తుత రాజ్యాంగం ప్రభుత్వానికి ఆటంకాలు కలిగిస్తోందట. అంటే న్యాయ పరిశీలన గిట్టడం లేదన్నది దాని అంతరార్థం. న్యాయమూర్తులను ఎంపిక చేసే అధికారం కొలీజియం దగ్గరే ఉండడం బీజేపీకి అస్సలు గిట్టదు. మొన్నటి దాకా న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు కొలీజియం విధానాన్ని, సుప్రీంకోర్టును ఎన్ని సార్లు విమర్శించారో లెక్కలేదు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ సైతం అదే పాట పాడుతుంటారు. ఈ హిందుత్వవాదులకు దేశాభివృద్ధికి ప్రస్తుత రాజ్యాంగమే ప్రధాన అడ్డంకిగా కనిపిస్తోంది.
ఇజ్రాయిల్లో లాగా పార్లమెంటు ఆమోదించే చట్టాలు రాజ్యాంగ బద్ధమైనవో కాదో పరిశీలించే అవకాశం న్యాయవ్యవస్థకు ఉండకూడదన్నది వీరి అభిలాష. అందుకే 1935 నాటి భారత చట్టానికి యధాతధ రూపమే మన రాజ్యాంగం అన్న పాత వాదనను వివేక్ దెబ్రాయ్ మళ్లీ లేవనెత్తారు. మరోవైపు ‘రాజ్యాంగాన్ని అనేక సార్లు సవరించాం. మునుపటి స్వరూపం లేదు కదా అందుకని కొత్తది రాసుకోవాలని’ వితండవాదం చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పులిచ్చి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడైన మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కూడా ఇప్పడు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ప్రశ్నిస్తున్నారు. నియంతృత్వం చెలాయించాలనుకునే వారికి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే, సెక్యులరిజాన్ని సమర్థించే రాజ్యాంగం అడ్డంకిగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు.
వీరు కోరుకుంటున్నట్టు కొత్త రాజ్యాంగాన్ని రాస్తే భవిష్యత్తులో అనేక తరాల వారు ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, న్యాయ వ్యవస్థ స్వతంత్రత లాంటి మాటలను మరిచిపోవాల్సిందే. ఈ మౌలిక అంశాలను పరిరక్షించే బాధ్యత భారత పౌరులదే. జాతీయోద్యమ లక్ష్యాలను, ప్రజల ఆకాంక్షలను, రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేయ చూస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పాల్సిందే. దేశ సంపదను కాపాడుకోవాలన్నా, దేశాభివృద్ధిని, ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలు రక్షించుకోవాలన్నా పోరాటమొక్కటే మార్గం.