– విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు : రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక సదస్సులో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారత రాజ్యాంగ, న్యాయవ్యవస్థలు ప్రమాదంలో ఉన్నాయనీ, వాటి విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘గవర్నర్ల పాత్ర-న్యాయస్థానాలు- భారత రాజ్యాంగం’ అంశంపై సదస్సు జరిగింది. దీనికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గవర్నర్ల వ్యవస్థను తెలుగుదేశం పార్టీతో పాటు ద్రవిడ రాజకీయపార్టీలన్నీ వ్యతిరేకించాయని తెలిపారు. చట్టసభలు చట్టాలు చేస్తే, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్, శాసనమండలి చైర్మెన్లు అమోదిస్తే సరిపోతుందనీ, దానికోసం గవర్నర్ల వ్యవస్థ ఎందుకనేది వారి ప్రశ్న అని చెప్పారు. అయితే చట్టసభలు రాజ్యాంగానికి లోబడే చట్టాలు చేయాలనీ, దానిలో ఏదైనా లోపాలు ఉంటే న్యాయవ్యవస్థ జోక్యం చేసుకొని, సరిచేయడం లేదా తిరస్కరించడం చేస్తుందని వివరించారు. ఎస్‌ఆర్ బొమ్మై కేసులో ఇదే జరిగిందని గుర్తుచేశారు. అన్ని వ్యవస్థలకు రాజ్యాంగమే సుప్రీం అనీ, అయితే రాజ్యాంగంలో న్యాయసమీక్షకు ప్రత్యేకంగా ఎలాంటి వ్యవస్థ లేదని చెప్పారు. న్యాయస్థానాలు స్వీయ హద్దులు నిర్ణయించుకొని ఆ బాధ్యతల్ని నిర్వహిస్తున్నాయని వివరించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను ఇబ్బందిపెట్టడమే గవర్నర్ల వ్యవస్థ లక్ష్యంగా మారిందనే విమర్శలు పెరుగుతున్నాయంటూ తమిళనాడు ఉదంతాన్ని ప్రస్తావించారు. రాజ్యాంగ న్యాయసమీక్షపై సర్కారియా కమిషన్ లోతైన అధ్యయనం చేసిందని చెప్పారు. కేంద్రంలో అధికారపార్టీ సభ్యుడు ఒకరు సుప్రీంకోర్టుకువెళ్లి ఫలానా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారనీ, ఇలాంటి చర్యలు న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 32 ప్రాథమిక హక్కును గుర్తిస్తుందనీ, ఇప్పుడు దీనిపైనే దాడి జరుగుతున్నదన్నారు. అన్ని వ్యవస్థలకు రాజ్యాంగమే సుప్రీం అనీ, దాన్ని పలుచన చేసే చర్యలు ఆందోళన కలిగిస్తాయని చెప్పారు.
ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్నవారు సుప్రీంకోర్టును శత్రుపక్షంగా చూస్తున్నారని విమర్శించారు. ఉప రాష్ట్రపతి థన్‌ఖడ్ సుప్రీం తీర్పులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, దాన్ని విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సభ్యుడు ఒకరు పహల్గాం ఉగ్రదాడికి సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి, న్యాయవ్యవస్థపై దాడి చేస్తున్నారని ఉదహరించారు. దేశంలో తటస్థంగా వ్యవహరిస్తున్న వ్యవస్థలను తమ ఆధీనంలోకి తెచ్చుకొనేందుకు కొన్ని రాజకీయశక్తులు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే నాలుగో స్తంభం అని చెప్పబడే మీడియాను నయానో, భయానో తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారనీ, ఇప్పుడు వారి దృష్టి రాజ్యాంగం, న్యాయవ్యవస్థలపై ఉన్నదని వివరించారు. పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల అనర్హత అంశాలు స్పీకర్ పరిధిలో ఉన్నా, దానికి నిర్ణీత గడువు లేదనీ, దాన్ని న్యాయవ్యవస్థ నిర్ణయిస్తే భరించలేని స్థితి ఉన్నదని చెప్పారు. రాజ్యాంగం మౌలిక స్వరూపం మార్చే ఉద్దేశ్యం అధికారంలో ఉన్నవారికి ఉన్నదనీ, దానికోసం ఆయా వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయిస్తున్నారని స్పష్టం చేశారు. సదస్సుకు తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ జీ విద్యాసాగర్ అధ్యక్షత వహించారు.
ప్రమాదంలో రాజ్యాంగ, న్యాయవ్యవస్థలు
- Advertisement -
RELATED ARTICLES