నవతెలంగాణ – అశ్వారావుపేట
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ(ఎం) స్వతంత్రంగానే పోటీలో ఉంటుందని, ఇప్పటికే రాష్ట్ర,జిల్లా కమిటీలు విధాన నిర్ణయం చేసామని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. బుధవారం సీనియర్ పార్టీ నాయకులు,నందిపాడు మాజీ సర్పంచ్ ఊకే వీరాస్వామి సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన అనంతరం అశ్వారావుపేట లోని ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
మతోన్మాదం, నయా ఉదార వాదం భారత దేశానికి పట్టిన రాహు కేతువులు అని వీటిని నిలువరించక పోతే ప్రజాస్వామ్యానికే గండం వాటిల్లుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. దేశంలో నేడు రెండు పార్శ్వాలు కనపడుతున్నాయని అందులో ఒకటి పెట్టుబడి దారులు, కార్పోరేట్ లు, ధనవంతుల భారత దేశం ఒకటి అయితే పేదలు,కష్టజీవులు,కార్మికులు,శ్రామికులు రెండో భారతదేశం అని వ్యాఖ్యానించారు.
నాడు తెల్ల బ్రిటీష్ వ్యాపారులకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్రం తెచ్చుకుంటే నేడు స్వదేశీయులే వ్యాపారులు అయి దేశ సంపదను కొల్లగొడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు. దేశ లౌకిక విధానం,ఫెడరలిజానికి భారతీయ జనతా పార్టీ రూపంలో ప్రమాదం పొంచి ఉందని తెలిపారు.
ఓటర్లు జాబితా ప్రక్షాళన తంతుగా మారింది అని,స్వయాన కేంద్ర ఎన్నికల సంఘమే కేంద్రప్రభుత్వానికి నకిలీ,దొంగ ఓట్లు చేర్పింపు లో సహకరిస్తుందని అన్నారు.బీహార్ లో లక్షలాది ఓట్లు నకిలీ అని రాహూల్ గాందీ ప్రదర్శించారని,ఇది దేశవ్యాప్త సమస్యగా మారే అవకాశం ఉందన్నారు.మోడీ – ట్రంప్ లు మేం మంచి స్నేహితులం అంటూనే భారత దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ట్రంప్ అమెరికాకు మాత్రమే అద్యక్షుడు అని ఆయన పెత్తనం ఇతర దేశాలు పై చేయడం ఏమిటని ప్రశ్నించారు.
అంతర్జాతీయ మార్కెట్ లో సహకరించే దేశాలు చాలా ఉన్నాయని,వాటితో భారత దేశం స్నేహ సంబంధాలు కొనసాగించాలని అన్నారు.నెహ్రూ కాలం నుండి రష్యా స్నేహ దేశంగా ఉండేదని ఆయన గుర్తు చేసారు.సుంకాలు పేరుతో ట్రంప్ ప్రపంచం గుత్తాధిపత్యం చలాయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.మతోన్మాదం,పెట్టుబడిదారీ విధానం,దోపిడీ తో ప్రజలను విముక్తి చేయడానికి దేశవ్యాప్త ఉద్యమాలు,పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.
రాష్ట్ర కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా పట్ల గత ప్రభుత్వం మాదిరే కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందని అన్నారు.అశ్వారావుపేట లో గుమ్మడి వల్లి ప్రాజెక్ట్ కట్ట తెగిపోయింది అని,భద్రాచలంలో గోదావరి కరకట్ట తెగిపోయి నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.నలుగురు ముఖ్యమంత్రులు మారినా సీతారామ ప్రాజెక్ట్ ను మాత్రం నేటికీ పూర్తి చేయలేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లయ్య,జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి,మండల కార్యదర్శి సోడెం ప్రసాద్,కార్యదర్శి వర్గ సభ్యులు గంగరాజు,మడిపల్లి వెంకటేశ్వరరావు లు పాల్గొన్నారు.