నవతెలంగాణ హైదరాబాద్: సరదాగా సాగాల్సిన క్రికెట్ మ్యాచ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. ఆటోలో తలెత్తిన వివాదం కారణంగా ఓ డిగ్రీ విద్యార్థిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఏపీలోని విశాఖపట్నంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖలోని పెదగదిలి కొండవాలు ప్రాంతానికి చెందిన డోల అజిత్ (23) స్థానిక కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో మధ్యాహ్నం తన స్నేహితులతో క్రికెట్ ఆడేందుకు బయటకు వెళ్లాడు. మ్యాచ్ సమయంలో అజిత్ టీమ్‌కు.. అదే ప్రాంతానికి చెందిన కిశోర్ అనే వ్యక్తికి మధ్య చిన్న ఘర్షణ తలెత్తింది. గ్రౌండ్‌లో ఉన్న స్నేహితులు సర్దిచెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది.
అయితే అజిత్, కిశోర్ మధ్య కొంతకాలంగా గొడవలు ఉన్నాయి. గత వారం జరిగిన పోలమాంబ పండుగ సమయంలోనూ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అప్పుడు జరిగిన అవమానాన్ని కిశోర్ మనసులో పెట్టుకున్నాడు. ఇంతలోనే మరో వివాదం జరగడంతో అజిత్‌పై కక్షపెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఫుల్లుగా తాగి పెదగదిలి కూడలిలో ఒంటరిగా వెళ్తున్న అజిత్‌తో కిశోర్ గొడవ పెట్టుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో అజిత్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి కిశోర్ పరారయ్యాడు.
ఈ ఘటనలో అజిత్ పొట్ట, ఛాతి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే అజిత్‌ను ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. కానీ తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ అజిత్ మరణించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తుండగా.. కిశోర్ భయంతో ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.


