Friday, May 16, 2025
Homeఅంతర్జాతీయంమళ్లీ పంజా విసురుతున్న కరోనా..

మళ్లీ పంజా విసురుతున్న కరోనా..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఆసియాలోని పలు దేశాల్లో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. ముఖ్యంగా అధిక జనసాంద్రత కలిగిన హాంకాంగ్, సింగపూర్‌ నగరాల్లో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని అక్కడి ఆరోగ్య అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామం ఆసియా వ్యాప్తంగా ఆందోళనలకు దారితీస్తోంది. హాంగ్‌కాంగ్‌లో ప్రస్తుతం వైరస్ కేసులు ‘చాలా ఎక్కువగా’ ఉన్నాయని నగర ఆరోగ్య పరిరక్షణ కేంద్రంలోని అంటువ్యాధుల విభాగం అధిపతి అల్బర్ట్ స్థానిక మీడియాకు తెలిపారు. ఇటీవల కాలంలో హాంగ్‌కాంగ్‌లో శ్వాసకోశ నమూనాల్లో కోవిడ్ పాజిటివ్‌గా తేలుతున్న వారి శాతం గతేడాది ఇదే సమయంతో పోలిస్తే అత్యధిక స్థాయికి చేరింది. మే 3తో ముగిసిన వారంలో తీవ్రమైన కేసులు, మరణాలు కూడా దాదాపు ఏడాది గరిష్ఠ స్థాయికి చేరి 31గా నమోదయ్యాయని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత రెండేళ్లలో చూసినంత తీవ్రస్థాయిలో ప్రస్తుత వ్యాప్తి లేనప్పటికీ, మురుగునీటిలో పెరుగుతున్న వైరల్ లోడ్, కోవిడ్ సంబంధిత వైద్య సంప్రదింపులు, ఆసుపత్రులలో చేరికలు వంటివి 70 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరంలో వైరస్ చురుకుగా వ్యాపిస్తోందని సూచిస్తున్నాయి.
సింగపూర్‌లో 14వేలకు పైగా కేసులు
ఆసియా ఆర్థిక కేంద్రంగా పేరొందిన సింగపూర్ కూడా కోవిడ్ విషయంలో అప్రమత్తమైంది. నగర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాదాపు ఏడాది తర్వాత ఈ నెలలో తొలిసారిగా ఇన్ఫెక్షన్ల సంఖ్యపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. మే 3తో ముగిసిన వారంలో అంతకుముందు ఏడు రోజులతో పోలిస్తే కేసుల సంఖ్య 28 శాతం పెరిగి 14,200కు చేరింది. రోజువారీ ఆసుపత్రి చేరికలు కూడా సుమారు 30 శాతం పెరిగాయి. సాధారణంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పుడు మాత్రమే సింగపూర్ ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడిస్తుంది. ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వేరియంట్లు మహమ్మారి సమయంలో ఉన్నంత వేగంగా వ్యాపించేవి లేదా మరింత తీవ్రమైనవి అనడానికి ఆధారాలు లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -