నవతెలంగాణ – హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో కల్తీ దగ్గు మందు సృష్టిస్తున్న విషాదం అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మరో చిన్నారి చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య 22కు చేరింది. ఖాజ్రీ అంటు గ్రామానికి చెందిన అయిదేళ్ల మయాంక్ సూర్యవంశీ, నాగ్‍పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. కిడ్నీలు పూర్తిగా విఫలం కావడమే మృతికి కారణమని వైద్యులు తెలిపారు.
తమిళనాడుకు చెందిన శ్రీశన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన ‘కోల్డ్రిఫ్’ అనే దగ్గు మందు తాగడం వల్లే మయాంక్ మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ సిరప్‌లో ప్రమాదకరమైన పారిశ్రామిక రసాయనం డైథిలిన్ గ్లైకాల్ (డీఈజీ) ఉన్నట్లు తేలింది. ఇది కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీసి, ప్రాణాలను హరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
సాధారణ జలుబు, దగ్గుతో బాధపడుతున్న పిల్లలకు ఈ సిరప్‌ను సూచించినట్లు తెలుస్తోంది. అయితే, ల్యాబ్ పరీక్షల్లో డీఈజీతో పాటు పారాసెటమాల్, క్లోర్‌ఫెనిరమైన్ వంటి నిషేధిత రసాయనాలు కూడా ఉన్నట్లు తేలింది. నాలుగేళ్లలోపు పిల్లలకు ఇలాంటి మందులను నిషేధిస్తూ 2023లోనే కేంద్రం ఆదేశాలు జారీ చేసినా, వాటి అమలులో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం నాగ్‍పూర్ ఆసుపత్రుల్లో మరికొందరు చిన్నారులు చికిత్స పొందుతుండగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన దేశంలో ఔషధ భద్రత, నియంత్రణ సంస్థల పనితీరుపై తీవ్ర చర్చకు దారితీసింది.