నవతెలంగాణ – హైదరాబాద్: ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్సే ప్రాణాలు తీసింది. అదుపు తప్పిన అంబులెన్స్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న మోటార్‌సైకిళ్లపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఓ జంట అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. గత రాత్రి సుమారు 11 గంటల సమయంలో బెంగళూరులోని రిచ్‌మండ్ సర్కిల్ వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. రెడ్ సిగ్నల్ పడటంతో పలువురు వాహనదారులు తమ బైక్‌లను ఆపి వేచి ఉన్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ అంబులెన్స్ అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది.
ప్రమాద తీవ్రతకు మూడు బైక్‌లు నుజ్జునుజ్జయ్యాయి. 40 ఏళ్ల ఇస్మాయిల్, ఆయన భార్య సమీన్ బాను ప్రయాణిస్తున్న డియో స్కూటర్‌ను అంబులెన్స్ బలంగా ఢీకొట్టి, కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మోటార్ సైకిళ్లను ఢీకొట్టిన తర్వాత అంబులెన్స్ సమీపంలోని పోలీస్ ఔట్‌పోస్ట్‌ను ఢీకొని ఆగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ధ్వంసమైన వాహనాలు, పోలీస్ ఔట్‌పోస్ట్ మధ్య ఇరుక్కుపోయిన అంబులెన్స్‌ను పక్కకు జరిపేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న విల్సన్ గార్డెన్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.



