– అవినీతి విచారణలో సాక్ష్యం వాయిదా కుదరదు
– ఇజ్రాయిల్ పీఎం అభ్యర్థన రెండుసార్లు తిరస్కరణ
– ట్రంప్ వ్యాఖ్యల తర్వాత కీలక పరిణామం
న్యూఢిల్లీ : ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అక్కడి న్యాయస్థానం నుంచి షాక్ తగిలింది. తనపై జరుగుతున్న అవినీతి విచారణలో సాక్ష్యమివ్వ టాన్ని రెండు వారాలు వాయిదా వేయాలన్న ఆయన అభ్యర్థనను ఇజ్రాయిల్ కోర్టు శుక్రవారం రెండుసార్లు తిరస్కరించింది. ఇరాన్‌తో ఇటీవల నెలకొన్న పరిస్థితులు, దౌత్యపరిణామాలను కారణాలుగా చూపుతూ నెతన్యాహు తరఫు న్యాయబృందం వాదనలు వినిపించినా ఫలితం కనబడలేదు. అటార్నీ కార్యాలయం ఈ చర్యను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పటంతో కోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. నెతన్యాహుపై ఉన్న అవినీతి కేసులు రద్దు చేయాలంటూ ఇజ్రాయిల్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే సూచించారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే ఇజ్రాయిల్ కోర్టు నెతన్యాహు అభ్యర్థనను తిరస్కరించటం గమనార్హం. ముడుపులు, మోసం, నమ్మకద్రోహం ఆరోపణలతో నెతన్యాహుపై 2019లో ఇజ్రాయిల్ లో కేసు నమోదైంది. దానికి సంబంధించి ఆయనపై విచారణ జరుగుతోంది. ఈ కేసు విచారణను తక్షణమే రద్దు చేయాలనీ, నెతన్యాహుకు క్షమాభిక్ష ప్రసాదించాలని ట్రంప్ సూచించిన విషయం విదితమే.
పిటిషన్‌కు సమర్ధన లేదు : కోర్టు
ఇరాన్‌తో ఇటీవల వివాదం నేపథ్యంలో జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా దౌత్య పరిణామాలను కారణాలుగా చూపెడుతూ ఆయన తరఫు న్యాయవాద బృందం విచారణలో వాయిదాను కోరారు. మొదటి సారి అభ్యర్థన తిరస్కరణ అయిన కొన్ని గంటలకే ఆయన మరో అభ్యర్థనతో ముందుకు వచ్చారు. న్యాయస్థానం దానిని కూడా తిరస్కరించటం గమనార్హం. ఆయన పిటిషన్‌కు తగిన సమర్ధన లేదని జెరూసలేం జిల్లా కోర్టు వెల్లడించింది. ఇరాన్‌తో ఇజ్రాయిల్ 12 రోజుల యుద్ధం ముగిసిన తర్వాత నెతన్యాహు అత్యవసర భద్రతా విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని ఆయన తరఫు న్యాయబృందం కోర్టులో వాదించింది. అయితే, ఈ వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రస్తుత రూపంలో షెడ్యూల్ చేయబడిన విచారణలను రద్దు చేయటానికి అభ్యర్థన ఒక ఆధారాన్ని, వివరణాత్మక కారణాన్ని అందించలేదని స్పష్టం చేసింది. దీంతో అవినీతి విచారణలో సాక్ష్యమివ్వాల్సిన అనివార్య పరిస్థితి ప్రస్తుతం నెతన్యాహుకు ఏర్పడింది.
ఇజ్రాయిల్ మంత్రుల అసహనం
నెతన్యాహు అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చటంపై ఆయన ప్రభుత్వంలోని మంత్రులు తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది నమ్మశక్యంకాని నిర్లిప్తతను, వాస్తవికతపై అవగాహన లేకపోవటం, జాతీయ ప్రాధాన్యతలు, ఆసక్తులపై కనీస అవగాహన లేకపోవటాన్ని సూచిస్తున్నదని ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ అన్నారు. జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్ గ్విర్, కమ్యూనికేషన్స్ మినిస్టర్ సైతం ఇదే స్వరాన్ని వినిపించారు. విచారణను పూర్తిగా నిలిపివేయాలన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. ఇరాన్‌తో యుద్ధం విషయంలో భయపెట్టినవారే మీడియా, న్యాయ సంస్కరణల విషయంలో తమను భయపెడుతున్నారని వాదించారు.
నెతన్యాహుకు కోర్టు షాక్
- Advertisement -
- Advertisement -