Friday, September 12, 2025
E-PAPER
Homeజాతీయంఅరుణస్వరం..సురవరం

అరుణస్వరం..సురవరం

- Advertisement -


– సీపీఐ అగ్రనేత సుధాకర్‌రెడ్డి కన్నుమూత
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
: సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. సీపీఐ రాష్ట్ర మహాసభలు మూడు రోజులుగా హైదరాబాద్‌ శివార్లలోని మేడ్చల్‌ జిల్లా గాజులరామారంలో జరుగుతున్నాయి. శుక్రవారం నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక కూడా జరిగి, మహాసభలు ముగిసాయి. అంతలోనే సురవరం మరణవార్త తెలియడంతో సీపీఐ నాయకులు, కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ విషయం తెలియగానే ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి సహా పలువురు మంత్రులు సంతాపం తెలిపారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖరరావు తదితరులు సురవరం మరణానికి సంతాపం ప్రకటించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న సుధాకర్‌రెడ్డి జన్మించారు. 1998, 2004 నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనకు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో బీఏ చదివి, అనంతరం ఎల్‌ఎల్‌బీ పట్టాపొందారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన భారత కమ్యూనిస్టుపార్టీ (సీపీఐ)లో జీవితాంతం క్రియాశీలకంగా పనిచేశారు. 2012 నుంచి 2019 వరకు 8 ఏండ్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అంతకుముందు రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా పనిచేశారు. సురవరం సుధాకర్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధులు. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు.
పాఠశాల స్థాయి నుంచే పోరాటం..
1968లో ఎల్‌ఎల్‌ఎమ్‌లో చేరినప్పటికీ విద్యార్థి నాయకుడిగా కొనసాగడంతో దాన్ని పూర్తి చేయలేకపోయారు. సురవరం సుధాకర్‌రెడ్డి 1957లో కర్నూలులో చదువుతున్న సమయంలో పాఠశాలల్లో బ్లాక్‌ బోర్డ్స్‌, చాక్‌పీస్‌, ప్రాథమిక అవసరాల కోసం ఆందోళన చేపట్టారు. ఇది కర్నూలులోని అన్ని పాఠశాలలకు విస్తరించి ఉద్యమంగా మారింది. 1960లో ఏఐఎస్‌ఎఫ్‌ కర్నూలు పట్టణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1962లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కోసం ఏర్పాటు చేసిన సన్నాహక కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ కమిటీ 62రోజుల పాటు చేసిన సమ్మెకు నాయకత్వం వహించారు. అనంతరం కర్నూలులోని కళాశాల విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1965లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ చదువుతున్న సమయంలో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో కళాశాల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐఎస్‌ఎఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాధ్యతలను ఆయనకు అప్పగించారు. 1966లో ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రధానకార్యదర్శి అయ్యాక, ఢిల్లీకి నివాసాన్ని మార్చారు. 1969లోనూ రెండోసారి ఏఐఎస్‌ఎఫ్‌పలువురు నేతల ఘన నివాళి ొ కమ్యూనిస్టుల ఐక్యతే ఆయన ఆకాంక్ష విద్యార్థి దశ నుంచే ఉద్యమాలవైపు.. ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. 1970లో ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడయ్యారు. 1972లో ఏఐవైఎఫ్‌ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
రాజకీయ పదవులు
1971లో కేరళలోని కొచ్చిన్‌లో జరిగిన సీపీఐ 9వ నేషనల్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో జాతీయ కమిటీ సభ్యుడయ్యారు. 1974లో తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఆయన అప్పటి నుంచి 1984 వరకు సీపీఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1985, 1990ల్లో కొల్లాపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1994లో కర్నూలులోని డోన్‌లో ముఖ్యమంత్రి విజయభాస్కర్‌రెడ్డిపై పోటీచేసి ఓడిపోయారు. 1998లో నల్గొండ పార్లమెంట్‌ నుంచి 12వ లోక్‌ సభకు ఎన్నికయ్యారు. అదే ఏడాది సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో విద్యుత్‌ బిల్లుల పెంపునకు వ్యతిరేకంగా వామపక్షాలు చేసిన పోరాటంలో సురవరం సుధాకర్‌ రెడ్డి కీలక పాత్ర పోషించారు. 2004లో జరిగిన 14వ లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నుంచే రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ సమయంలోనే సురవరం కార్మికశాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మెన్‌ అయ్యారు. 2007లో హైదరాబాద్‌లో జరిగిన సీపీఐ జాతీయ మహాసభల్లో ఉప ప్రధానకార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2012 పాట్నాలో జరిగిన జాతీయ మహాసభల్లో పార్టీ ప్రధానకార్యదర్శిగా నియమితులయ్యారు. చండ్రరాజేశ్వ రరావు తరువాత సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శిగా ఎన్నికైన రెండో తెలుగు వ్యక్తిగా సురవరం నిలిచారు. 2015 మహాసభల్లోనూ ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. ఆ తరువాత కొల్లంలో మూడోసారి తిరిగి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2012 నుంచి 2019వరకు ఆయన జాతీయ ప్రధానకార్యదర్శిగా పదవిలో కొనసాగారు. ఆయన ఎప్పుడూ కమ్యూనిస్టు పార్టీల విలీనాన్ని కోరుకునేవారు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో, అనేక వేదికలపై వ్యక్తం చేశారు.
ప్రజా పోరాటాల సారధి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రాష్ట్రంలో, దేశంలో అనేక ప్రజా పోరాటాలకు సారధ్యం వహించిన గొప్ప కమ్యూనిస్టు నేత సురవరం అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొండ్రవుపల్లి అనే మారుమూల పల్లెలో జన్మించి, జాతీయ స్థాయి నేతగా ఎదిగిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శనీయమని తెలిపారు. సురవరం మరణం పట్ల భట్టి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు కూడా సురవరం మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు.
ఆయన ఉద్యమ పంథా చిరస్మరణీయం : మాజీ మంత్రి హరీశ్‌రావు
సురవరం ఉద్యమ పంథా, ఆయన ప్రజా సేవ చిరస్మరణీయమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొంటూ సంతాపాన్ని ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు కూడా సురవరం మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -