నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్‌లో జరిగిన జనరేషన్ జెడ్ నిరసనల్లో 20 మంది యువకులు మృతి చెందడం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూట్ ప్రకటన విడుదల చేసింది. ఈ నిరసనలు.. ప్రజలు, ముఖ్యంగా యువత తమ సమస్యలను పరిష్కరించడంలో, వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వాలు పదేపదే వైఫల్యం చెందడం పట్ల పెరిగిన ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తాయి.
పాలకవర్గాల్లో పెరిగిన అవినీతి, పెరుగుతున్న నిరుద్యోగం, ప్రధానంగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వంటి కారణాలే జనరేషన్ జెడ్ నిరసనలకు ప్రధాన కారణాలని ఈ ప్రకటన పేర్కొంది. పెల్లుబికిన నిరసనలతో కె.పి ఓలి ప్రభుత్వం పదవీచ్యుతి చెందిన తర్వాత.. అక్కడ శాంతి, సాధారణ స్థితిని పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగించాలి. ప్రముఖ రాజకీయ నేతలపై జరుగుతున్న మూక హింస దృష్ట్యా ఇది అత్యంత అవసరం అని సిపిఐ(ఎం) నొక్కి చెప్పింది. ఈ నిరసనకారుల దాడిలో నేపాల్ మాజీ ప్రధానమంత్రి ఝలనాథ్ ఖనాల్ భార్య రాజ్యలక్ష్మీ చిత్రాకర్ మరణించారు. ఆమెపై జరిగిన దాడిని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది.
నేపాల్ యువత డిమాండ్లను వెంటనే వినాలి. వాటిని పరిష్కరించడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో రాచరికానికి వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య, లౌకిక విలువలను కాపాడటానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పరిస్థితుల్లో రాచరికవాదులు, ఇతర ప్రతిచర్య శక్తులు దోపిడీ చేయకుండా నేపాల్ యువత, ప్రజాస్వామ్య శక్తులు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ సామూహిక నిరసనల ఫలితం ప్రజాస్వామ్య పునరుద్ధరణ కావాలి కానీ తిరిగి భూస్వామ్య నిరంకుశ పాలనలోకి వెళ్లే విధంగా ఉండకూడదు అని సిపిఐ(ఎం) ఈ ప్రకటనలో స్పష్టం చేసింది.