నవతెలంగాణ-హైదరాబాద్: వెనిజులాపై అమెరికా దురాక్రమణను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎం) పేర్కొంది. వెనిజులాపై దురాక్రమణను ఖండిస్తూ సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ” బాంబు దాడుల ద్వారా వెనిజులాపై అమెరికా దురాక్రమణ చర్యను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తుంది. గతకొన్ని వారాలుగా అమెరికా వెనిజులా చుట్టూ తన సైనిక, నావికా దళాలను మోహరిస్తూ బలవంతంగా ప్రభుత్వాన్ని మార్చేందుకు యత్నిస్తోంది. 2025 డిసెంబర్ మొదటి వారంలో అమెరికా ప్రకటించిన జాతీయ భద్రతా వ్యూహం వాస్తవ ముఖచిత్రం ఇదేనని పేర్కొంది. పశ్చిమార్థగోళంలో అమెరికా సైన్యాన్ని మోహరించడం, మొత్తం ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తీసుకురావాలనే ఉద్దేశ్యాన్ని బహిరంగంగా ప్రకటించడం ద్వారా ట్రంప్ జేమ్స్ మన్రో సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారని స్పష్టమౌతోంది” అని ప్రకటనలో పేర్కొంది.
కరేబియన్ జలాల్లో మోహరించిన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని, వెనిజులాపై అమెరికా చేపడుతున్న దురాక్రమణ దాడులను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎం)పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. లాటిన్ అమెరికాను శాంతి జోన్‌గా ప్రకటించాలని, సార్వభౌమ దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదని సిపిఐ(ఎం) హెచ్చరించింది.
అమెరికా దురాక్రమణను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి) తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని పిలుపునిచ్చింది. వెనిజులాపై దురాక్రమణను వెంటనే నిలిపివేసేలా అమెరికాపై అంతర్జాతీయంగా ఒత్తిడిని పెంచాలని సిపిఐ(ఎం) సూచించింది.



