సంతోషంతో పిల్లల మనసులు ఆకాశంలో గాలిపటంలా ఎగిరిపోవాలంటే జొన్నలగడ్డ శ్యామల ‘సంతోషాల గాలిపటం’ బాలల కథల పుస్తకం చదవాల్సిందే!
ఈ పుస్తకం అందమైన బొమ్మలతో ఆకర్షణీయంగా ఉండి పిల్లలను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ పుస్తకంలోని 30 కథలు.. అన్నీ ఆణిముత్యాలే. విజ్ఞానాన్ని సున్నితంగా తెలియచెప్పేవే. సమాజంలో పిల్లలు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలను ఓ మాల చేసి సరస్వతీదేవి మెడలో వేసిన అనుభూతి కలుగుతుంది.
బంధాల విలువలు, బాలబాలికల సమానత్వం, బడి పిల్లల సమస్యలు, హోలీలో హాని చేసే రంగుల బదులు ప్రకతి సిద్ధమైన రంగులు ఎలా తయారు చేసుకోవచ్చు, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి, ఉగాది వైశిష్ట్యం, వినాయకుడి గుణ గుణాల విశదీకరణ, చెట్లకి పుట్టినరోజు జరుపుకోవటం, ఇలా ఎన్నో.. ఎన్నో.. ఎన్నెన్నో..
అన్నీ కుటుంబ సభ్యులు, మన చుట్టూ సమాజంలో ఉన్న వ్యక్తులు, ఉపాధ్యాయుల, బడి పిల్లల పాత్రల మధ్య జరిపే సంభాషణలతో అలరారింది. మధ్యమధ్యలో జంతువులు కథలు, సరదా సంబరాలతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది ఈ సంతోషాల గాలిపటం.
కాకపోతే పిల్లల పుస్తకం కాబట్టి రవ్వంత అక్షరాలు పెద్దవిగా ముద్రించి ఉంటే బాగుండేదేమో అనిపించింది. రచయిత్రి మరిన్ని బాలల కథల పుస్తకాలను ముద్రణలోకి తీసుకురావాలని ఆకాంక్షిస్తూ అందరూ చదవండి. అందరితో చదివించండి.
- యలమర్తి అనూరాధ, 9247260206