సమాజంలో ఎంత మార్పు వచ్చినా ఇప్పటికీ కొన్ని పనులు పురుషులకు మాత్రమే పరిమితమ య్యాయి. వాటిలో వెల్డింగ్ వర్క్ ఒకటి. మహిళలు ఇప్పుడు అందులోనూ లింగ వివక్షను బద్దలు కొడుతూ తమ సత్తా చాటుకుంటున్నారు. మంగళూరులోని ప్రజ్ జెన్ఎక్స్ వారికి కావల్సిన సహకారం అందిస్తోంది. కర్ణాటక రాష్ట్రం నుంచి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన రాణి చెన్నమ్మ మహిళా వెల్డర్ల బృందం అని వారికి పేరు పెట్టింది. ప్రజ్ ఇండిస్టీస్ వారి జెన్ఎక్స్ 50 మంది మహిళలకు వెల్డర్లుగా శిక్షణ ఇచ్చి నియమించింది. పురుషాధిక్య పరిశ్రమలోకి మహిళలు అడుగు పెట్టడం అంటే అంత సులువైన విషయం కాదు. ఎదురైన ప్రతి సమస్యనూ చాలెంజ్‌గా తీసుకొని నిలబడిన ఐదుగురు మహిళా వెల్డర్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం…
సుచిత
కర్ణాటకలోని ఉడిపి సమీపంలోని ఉచ్చిలా అనే గ్రామానికి చెందిన ముప్పై నాలుగేండ్ల సుచిత.. ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తుండేది. మంగళూరులో ప్రజ్ అనే సంస్థ మహిళలకు వెల్డింగ్ శిక్షణ ఇస్తుందని ఆమెకు తెలిసింది. బికామ్ గ్రాడ్యుయేట్ చేసిన సుచితకు అకౌంట్స్‌లో ఉద్యోగం దొరకడం కష్టంగా మారింది. ఇద్దరు పిల్లల తల్లి, భర్త దుబారులో ఉంటున్నాడు. దాంతో సుచిత తన తల్లిదండ్రులతోనే ఉంటుంది. ‘ఇంటర్వ్యూ కోసం వచ్చి ఎంపికయ్యాను. తొమ్మిది నెలల కిందట మూడు నెలల శిక్షణ, పరీక్షలు క్లియర్ చేసిన తర్వాత ఉద్యోగంలో చేరాను’ అని ఆమె చెప్పింది. కెనడా, యుఎస్లలో మహిళా వెల్డర్ల యూట్యూబ్ వీడియోలు చూసి ప్రేరణ పొందిన ఆము క్వాలిటీ కంట్రోల్ విభాగంలో వెల్డర్‌గా పనిచేస్తుంది. ‘మొదట్లో రెండు, మూడు రోజులు నేర్చుకోవడం కష్టంగా ఉండేది. నా నిర్ణయం సరైనదేనా అనిపించింది. పని నేర్చుకున్న తర్వాత నమ్మకంతో పాటు ప్రేరణ పొందాను’ అని ఆమె పంచుకుంది. ప్రస్తుతం సుచిత జనరల్ షిఫ్ట్‌లో పనిచేస్తుంది. ఫ్యాక్టరీల చట్టం కింద అన్ని ప్రయోజనాలను పొందుతుంది. ‘నా కుటుంబం నన్ను చూసి గర్విస్తుంది. 6జీ (పైపును 45-డిగ్రీల కోణంలో బిగించడం) వెల్డర్‌గా ఎదగాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో విదేశాలలో పని చేయాలనుకుంటున్నాను’ అన్నది.
సించన
ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు సించన రోడ్డు పక్కన దుకాణాలలో చేసే వెల్డింగ్ పనులను ఊహించుకుంది. సందేహంగానే ఆమె ఇంటర్వ్యూకి వెళ్ళింది. అక్కడ తన పనికి సంబంధించిన అనేక వీడియోలు చూసింది. గతంలో ఆమె బెంగళూరులో అకౌంటెంట్‌గా పనిచేసేది. ప్రజ్‌లో పని సవాలుతో పాటు ఆసక్తిగా ఉంటుందని గ్రహించి అంగీకరించింది. ఇప్పుడు ఆమె సీఎన్సీ ఆపరేటర్, ప్రోగ్రామర్‌గా పనిచేస్తుంది. లేజర్ కటింగ్ వంటి పెద్ద యంత్రాలలో పనిచేస్తుంది. ‘ప్లాస్మా కటింగ్ కొంచెం కష్టం. మేము బరువైన వస్తువులను కూడా ఎత్తాలి దీని కోసం మాకు మగ సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. ఈ ఉద్యోగం నేను స్వతంత్రంగా, ఆర్థికంగా సురక్షితంగా ఉండటానికి సహాయపడింది’ అని ఆమె చెప్పింది. మూడు నెలల శిక్షణ తర్వాత ఆమె 3జీ స్థాయిని పూర్తి చేసి +వీAఔ, ూAఔ, కోపింగ్ మెషిన్‌పై పనిచేసింది. ‘నాకు ప్రోగ్రామింగ్‌లో కొంత జ్ఞానం ఉన్న కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా ఉన్నందున వారు నన్ను ప్రోగ్రామింగ్‌లో ఉంచారు. మొదట్లో హెల్మెట్ ధరించడం చాలా ఇబ్బందిగా ఉండేది. తర్వాత చాలా సంతోష పడ్డాను. ఇక్కడే నా పని కొనసాగించాలనుకుంటున్నాను’ అని ఆమె చెప్పింది.
అనిషా
పడుబిద్రి పట్టణానికి చెందిన అనిషా (26) బికాం కోర్సు పూర్తి చేసి ఓ ఏడాది ఫొటోగ్రఫీలో పని చేసింది. తర్వాత స్థానిక ఫ్యాక్టరీలో హెల్పర్‌గా చేరింది. తన తమ్ముడి స్నేహితుడి ద్వారా ప్రజ్ గురించి తెలుసుకుంది. ‘నేను విద్యుత్ స్పార్క్‌లకు భయపడ్డాను, కానీ తర్వాత ఆసక్తి పెరిగింది. నా తమ్ముడు, అమ్మ నన్ను ఆ పనికి వెళ్లొద్దన్నారు. కానీ నేను వినలేదు. నాది రెండవ బ్యాచ్. ఇప్పటికే 25 మంది అమ్మాయిలు వెల్డర్లుగా పనిచేస్తున్నారు. నేను కూడా పని చేయాలని నిర్ణయించుకున్నాను’ అని ఆమె చెప్పింది. అనిషా ప్రస్తుతం కటింగ్, డ్రిల్లింగ్ మెషీన్లో ఆరు నెలలుగా సీఎన్సీ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. ‘ఇది సవాలుగా ఉన్నా నేను అదే చేయాలనుకున్నాను. శిక్షణ తర్వాత నమ్మకం కలిగింది. 15 రోజులు భయపడ్డాను. తర్వాత సీఎన్సీ ఆపరేటర్‌గా శిక్షణ పొందాను’ అని ఆమె వివరిస్తుంది. కుటుంబం వద్దన్నా, ఇతరులు అవమానించినా చాలా మంది మహిళలు చేయడానికి ఇష్టపడని పని తాను చేస్తున్నానని అనిషా గర్వంగా ఉంది.
ప్రజ్ఞ
21 ఏండ్ల ప్రజ్ఞ ప్రజ్లోని వెల్డింగ్ బృందంలో అతి పిన్న వయస్కురాలు. ఉడిపికి చెందిన ఆమె బెంగళూరులో సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసింది. అక్క ఆమెకు ప్రజ్‌లో వెల్డర్ ఉద్యోగ అవకాశం గురించి చెప్పే నాటికి మంగళూరులోని ఒక ఇంజనీరింగ్ సైట్లో కొంతకాలం పనిచేసింది. ఆమెకు వెల్డింగ్ గురించి ప్రాథమిక జ్ఞానం ఉంది. సీఎన్సీ ఆపరేటర్‌గా ఆమె ఆరు నెలల కిందట చేరింది. ‘నేను చాంఫరింగ్ మెషిన్‌పై పని చేస్తాను (ఇది పదునైన అంచులను తొలగించడానికి, వంపుతిరిగిన లేదా వాలుగా ఉన్న ఉపరితలాన్ని సృష్టించడానికి ఉపయోగించ బడుతుంది). ప్రారంభంలో నాకు భారీ లిఫ్టింగ్ సవాలుగా అనిపించింది. గతంలో నేను ఇతరుల సహాయం తీసుకున్నాను. ముఖ్యంగా పురుషుల సహాయం తీసుకున్నాను. కానీ ఇప్పుడు నేనే స్వతంత్రంగా నా పని చేస్తున్నాను. ఇక్కడే మరింత అనుభవం పొందాలనుకుంటున్నాను. తర్వాత విదేశాలలో అవకాశాల కోసం వెదుక్కుంటాను’ అని చెప్పింది.
సౌమ్య
రెండవ బ్యాచ్‌కు చెందిన ముప్పై ఐదు ఏండ్ల సౌమ్య, ఐఎన్జీ వైశ్య బ్యాంక్ కాల్ సెంటర్లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసింది. ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె ఒక స్నేహితుడి ద్వారా ప్రజ్ గురించి విన్నది. ‘వెల్డింగ్ అంటే పురుషుల పనిగా అనుకుంటారు. చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ప్రారంభంలో కొంచెం భయపడ్డాను. కానీ మొదటి బ్యాచ్ మహిళల సమావేశానికి హాజరైనప్పుడు నా సందేహాలన్నీ మాయమయ్యాయి. శిక్షణ తర్వాత ఆత్మవిశ్వాసం పొంది, ఉత్సాహంతో పని ప్రారంభించాను’ అని ఆమె చెప్పింది. ఆమె +వీAఔ, ూAఔ లలో వెల్డర్‌గా పనిచేస్తుంది. ఈ రెండూ ఆర్క్ వెల్డింగ్ ప్రక్రియలు, ఇవి ఫ్లక్స్-కోటెడ్ ఎలక్ట్రోడ్‌ను ఉపయోగించి వెల్డ్ను సృష్టిస్తాయి. ‘పనిలో మమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేది పొగ. అయితే రక్షణ పరికరాలు మనల్ని సురక్షితంగా ఉంచుతాయి. అందుతున్న ప్రయోజనాలు, సౌకర్యాలతో నేను సంతోషంగా ఉన్నాను’ అని ఆమె చెప్పింది. సౌమ్య తల్లి మొదట్లో ఆమెను ఈ ఉద్యోగంలో చేరకుండా ఆపేసింది. కానీ ఇప్పుడు ఆమే తన కుమార్తె భిన్నమైనది చేస్తున్నందుకు గర్వపడుతోంది.