– 42 శాతం మంది రూ.50,000 పైగా క్రెడిట్ కార్డుతో ఖర్చు
– 91 శాతం మంది క్రెడిట్ కార్డ్ ఆఫర్లను దృష్టిలో పెట్టుకొని కొనుగోళ్లు
– 48 శాతం మంది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో షాపింగ్
– పైసాబజార్ సర్వేలో వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 29, 2025: దీపావళి షాపింగ్లో క్రెడిట్ కార్డుల హవా స్పష్టంగా కనిపించిందని పైసాబజార్ సీఈఓ సంతోష్ అగర్వాల్ తెలిపారు. పైసాబజార్ నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయన్నారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా 42 శాతం మంది క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ.50,000 పైగా ఖర్చు చేసినట్లు వెల్లడైందన్నారు. వీరిలో 22 శాతం మంది రూ.50,000 నుంచి రూ.లక్ష వరకు, 20 శాతం మంది రూ.లక్షకు పైగా క్రెడిట్ కార్డుల ద్వారా ఖర్చు చేశారని తెలిపారు. ఈ సర్వీలో 2300 మందికి పైగా పాల్గొన్నారన్నారు. దీపావళి సమయంలో ఇంటి వినియోగ పరికరాలు (25 శాతం), మొబైల్స్, గాడ్జెట్లు, యాక్సెసరీలు (23 శాతం), దుస్తులు (22 శాతం) కొనుగోలు చేసిన విభాగాలుగా నిలిచాయన్నారు. ఫర్నిచర్, హోమ్ డెకర్ (18 శాతం), బంగారం, ఆభరణాలు (12 శాతం) కూడా క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్ళు జరిగాయన్నారు. ఈ సర్వే ద్వారా పెద్ద మొత్తంలో షాపింగ్ చేస్తున్నప్పుడు క్రెడిట్ కార్డుల వినియోగం రివార్డులు, క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్ల ద్వారా మరింత ప్రయోజనకరంగా మారుతోందని స్పష్టమవుతుందన్నారు.
దీపావళి సమయంలో అధిక విలువైన కొనుగోళ్ల కోసం క్రెడిట్ కార్డుల వినియోగం పెరగడం వినియోగదారులు విలువ, అనుకూలత వైపు మరింతగా మొగ్గు చూపుతున్నారన్న విషయం తెలియజేస్తోందన్నారు. వినియోగదారులు ఇప్పుడు క్రెడిట్ కార్డులను మరింత వ్యూహాత్మకంగా ఉపయోగిస్తూ, పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేసే సమయంలో పండుగ ఆఫర్లు, ప్రత్యేక రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్‌లు వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉండే వేళ కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ సర్వే, క్రెడిట్ కార్డుల ప్రాచుర్యం పెరుగుతోందనే దానికి వినియోగదారులలో ఆర్థిక అవగాహన పెరుగుతోందనే దానికి నిదర్శనమన్నారు. ఈ సర్వేలో వెలుగులోకి వచ్చిన ఇతర ముఖ్యమైన విషయాలు.. 91 శాతం మంది క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కొనుగోళ్లు చేయడానికి ముందు కార్డ్ ఆఫర్లను పరిశీలించి ప్లాన్ చేశారన్నారు. 10 శాతం కన్నా తక్కువ మంది ఏ ఆఫర్ కోసం ఎదురు చూడకుండా, తమ కార్డులో ఉన్న సాధారణ క్యాష్‌బ్యాక్ లేదా రివార్డ్ స్ట్రక్చర్‌పై ఆధారపడినట్లు వెల్లడించారన్నారు. ఇది పండుగ సమయంలో చేసే కొనుగోలు నిర్ణయాలు ఇప్పుడు విలువపై ఆధారపడే నిర్ణయాలుగా మారుతున్నాయని తెలిపారు. వినియోగదారులు పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేసే సమయంలో క్రెడిట్ కార్డ్ ఆఫర్లు, పండుగ స్కీములు, పార్ట్నర్ స్టోర్ డిస్కౌంట్‌లు వంటి ప్రయోజనాలు గరిష్టంగా పొందేందుకు ప్రణాళికలు వేస్తున్నారన్నారు. 71 శాతం మంది రెగ్యులర్ షాపింగ్ కోసం క్యాష్‌బ్యాక్, రివార్డ్స్ అందించే ప్రత్యేక క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారని తెలిపారు. దాదాపు 20 శాతం మంది క్యాష్‌బ్యాక్‌ను ఎన్నుకోవడంతో పండుగ కాలంలో క్రెడిట్ కార్డ్ వినియోగంలో క్యాష్‌బ్యాక్ అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రోత్సాహకంగా నిలిచిందన్నారు. అదే సమయంలో కో-బ్రాండెడ్ ఆఫర్లు (19 శాతం), యాక్సిలరేటెడ్ రివార్డ్ పాయింట్లు (18 శాతం) కూడా వినియోగదారులను ఆకర్షించిన కీలక కారణాలుగా గుర్తించబడ్డాయని పేర్కొన్నారు. నో కాస్ట్ ఈఎంఐ అత్యధికంగా ప్రాధాన్యం పొందిందని, ఇది 56 శాతంగా ఉందన్నారు. ఉత్తమ డిస్కౌంట్లు ఆకర్షించిన వారు 29 శాతం, చెల్లింపులను కొంతకాలం పాటు విభజించుకోవడం కోసం సాధారణ ఈఎంఐ 10 శాతం మంది ఉన్నారన్నారు. ఈ సర్వేలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, 48 శాతం మంది వినియోగదారులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్‌ను కలిపి చేశారన్నారు. ఇది ఇప్పుడు పండుగ సమయంలో కార్డ్ వినియోగదారులు చానెల్‌ను కాదని, విలువ సౌకర్యాన్ని చూస్తున్నారనడానికి సంకేతం అన్నారు. అనేక మంది తక్కువ ధరలు, ఆఫర్ల కోసం ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లను ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఉత్పత్తిని ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడానికి ఆఫ్‌లైన్ స్టోర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా పైసాబజార్ క్రెడిట్ కార్డ్ విభాగాధిపతి రోహిత్ చబ్బర్ మాట్లాడుతూ ఈ ఏడాది సర్వేలో వ్యూహాత్మకంగా ఆలోచించే వినియోగదారులు పెరుగుతున్నారన్న విషయం స్పష్టమవుతోందని తెలిపారు. తమ క్రెడిట్ కార్డుల ప్రయోజనాలను గరిష్టం చేసుకునేలా కొనుగోళ్లు ప్లాన్ చేస్తున్నారన్నారు. ఆన్‌లైన్ కావచ్చు, ఆఫ్‌లైన్ కావచ్చు వారు సౌకర్యం, ఆదా, రివార్డులు అన్నింటినీ సమన్వయం చేస్తూ కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సర్వేలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించాయన్నారు. ఈ సర్వేకు స్పందించిన వారిలో 43 శాతం మంది ప్రధానంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ను తమ పండుగ కొనుగోళ్ల కోసం ఎంచుకున్నారని తెలిపారు. 15 శాతం మంది మింత్రాను, 10 శాతం మంది మీషోకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. అజియో, నైకా, జెప్టో, టాటా క్లిక్ వంటి ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లు కలిపి మొత్తం 32 శాతం మార్కెట్ షేర్‌ను పొందినట్లు సర్వే తెలియజేసిందని పేర్కొన్నారు.



