నవతెలంగాణ-హైదరాబాద్: గాజాలో కఠినమైన వాతావరణ పరిస్థితులతో స్థానభ్రంశమైన పాలస్తీనియన్లు తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారని గవర్నమెంట్ ఆపరేషన్స్ ఫర్ ఎమర్జెన్సీ ఇంటర్వెన్షన్స్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. గాజాస్ట్రిప్‌లో కఠిన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి, స్థానభ్రంశమైన కుటుంబాల ఆశ్రయం కోసం సుమారు 2,00,000 ముందుగా నిర్మితమైన గృహాలు (సులభంగా తరలించగలిగేవి) అవసరమని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. ప్రజలకు అవసరమైన మానవతా సాయాన్ని అనుమతించేలా ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేసింది.
ఇటీవల తుఫాను కారణంగా వరదలు ముంచెత్తడంతో వేలాది శిబిరాలు ధ్వంసమయ్యాయని ఆప్రకటన తెలిపింది. ఇజ్రాయిల్ మారణహోమం కారణంగా ఇప్పటికే పాలస్తీనియన్లు ఎదుర్కొంటున్న క్లిష్టమైన అత్యవసర మానవతా పరిస్థితులను ప్రకృతి విపత్తులు మరింత తీవ్రతరం చేశాయని పేర్కొంది. ముఖ్యంగా తీరప్రాంతమైన అల్-రషీద్ స్ట్రీట్‌లో విధ్వంసం సృష్టించిందని, సుమారు 26 కిలోమీటర్ల విస్తీర్ణంలో సముద్రపు తీరాన ఉన్న తాత్కాలిక శిబిరాలు తుడిచిపెట్టుకుపోయాయని తెలిపింది. సహాయ సంస్థల ప్రతిస్పందన సామర్థ్యం కూడా రాజీపడిందని ఆ ప్రకటన పేర్కొంది. సామాగ్రి కొరత, సాయంపై కొనసాగుతున్న ఇజ్రాయిల్ ఆంక్షలతో స్థానభ్రంశం చెందిన పాలస్తీనియన్ల డిమాండ్లను తీర్చడం అసాధ్యమని తెలిపింది.



