Sunday, May 4, 2025
Homeరాష్ట్రీయంరాజకీయకుట్రతోనే కాళేశ్వరంపై విమర్శలు

రాజకీయకుట్రతోనే కాళేశ్వరంపై విమర్శలు

- Advertisement -

– ఆనాడు కాంగ్రెస్‌ నేతలే రూ.2700 కోట్లు దోచుకుతిన్నారు : హరీశ్‌రావు ఆగ్రహం
– శ్రీధర్‌దేశ్‌పాండే పుస్తకాల ఆవిష్కరణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాజకీయ కుట్రతోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరాధార విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే తమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవని నిపుణులు చెబుతున్నా, మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ల పేర రూ. 2700 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అప్పుడు ఉమ్మడి ఏపీ, మహారాష్ట్రతోపాటు కేంద్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలో ఉందన్నారు. ఆతరువాత మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వచ్చినా కేసీఆర్‌ పలుమార్లు కోరినా ప్రాణహిత ప్రాజెక్టు విషయాన్ని పట్టించుకోలేదన్నారు. ఓప్పందం చేసుకోవడానికి ముందుకు రాలేదని గుర్తు చేశారు. హైదరాబాద్‌ తెలుగు విశ్వవిద్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్‌ ఓఎస్డీ శ్రీదర్‌రావు దేశ్‌పాండే రాసిన సాగునీటిరంగంలో పదేండ్ల ప్రస్తానం, నీళ్లు నిజాలు అనే పుస్తకాలు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేతలు వి. ప్రకాష్‌, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, మాణిక్యాలరావు, చింతా ప్రభాకర్‌, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, సీనియర్‌ జర్నలిస్టు వేణుగోపాల్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ కేసీఆర్‌ చేసిన మంచి పనులను చరిత్ర పుటల్లో లేకుండా చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదన్నారు.రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టొద్దని హితవు పలికారు. సాగునీటి రంగంలో కేసీఆర్‌ 100 ఏండ్ల ముందుకు ఆలోచించారని చెప్పారు. తమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవని చెబితేనే కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని చెప్పారు. కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసమంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం బద్నాం చేస్తున్నదని వివరించారు. అప్పట్లో ఏడేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందన్నారు. శ్రీధర్‌రావు దేశ్‌పాండే సౌమ్యుడు, తపన ఉన్న వ్యక్తి అన్నారు. ఎన్డీఎస్‌ఏ, విజిలెన్స్‌ రిపోర్టు వచ్చిన నేపథ్యంలో ఈ పుస్తకాల ఆవిష్కరణ మంచి ప్రయత్నమని అభినందించారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో నీటికి చాలా ప్రాధాన్యత ఉన్నదన్నారు. రాష్ట్రం వచ్చిన తరువాత దానిపై ప్రజలు, యువతకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యామని అన్నారు. ఆ కర్తవ్యాన్ని భవిష్యత్‌లోనైనా నెరవేర్చాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ అధ్యక్షత వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -