Friday, July 25, 2025
E-PAPER
Homeజాతీయంనిరుద్యోగంపై కాకి లెక్కలు

నిరుద్యోగంపై కాకి లెక్కలు

- Advertisement -

వాస్తవాలను ప్రతిబింబించని ప్రభుత్వ డేటా ొ బ్యాంకింగ్‌ రంగంలో తగ్గిపోతున్న నియామకాలు
నిర్వచనంలోనే లోపాలు ొ తయారీ రంగంపై దృష్టి పెట్టాలంటున్న నిపుణులు

న్యూఢిల్లీ : నిరుద్యోగంపై ప్రభుత్వం అందజేసిన డేటా తప్పుల తడకగా ఉన్నదని పలువురు ఆర్థికవేత్తలు తేల్చి చెప్పారు. భారత ప్రభుత్వం ఇచ్చిన అధికారిక గణాంకాలతో పోలిస్తే దేశంలో నిరుద్యోగ పరిస్థితి దారుణంగా ఉన్నదని వారు స్పష్టం చేశారు. రాయిటర్స్‌ వార్తా సంస్థ సంప్రదించిన ఆర్థికవేత్తలలో 70 శాతానికి పైగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. గత వారం రాయిటర్స్‌ యాభై మంది ఆర్థికవేత్తలతో పోల్‌ నిర్వహిం చింది. జూన్‌లో నిరుద్యోగ రేటు 5.6 శాతంగా ఉన్నదని ప్రభుత్వం అందించిన డేటాతో 37 మంది ఆర్థికవేత్తలు విభేదించారు. నిరుద్యోగ రేటు 7-35 శాతం మధ్య ఉన్నదని 17 మంది కుండబద్దలు కొట్టారు.
కాలం చెల్లిన నిర్వచనాలు
నిరుద్యోగ డేటాను నమోదు చేసే పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) వారానికి ఒక గంట పనిచేసిన వవారిని కూడా ఉద్యోగిగానే పరిగణిస్తుంది. ఉపాధి కోసం తీసుకుంటున్న ఇలాంటి కాలం చెల్లిన నిర్వచనాలే తప్పుడు లెక్కలకు కారణమవు తున్నాయని ఆర్థికవేత్తలు అంటున్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారిక గణాంకాలలో అది కన్పించడం లేదని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌ ఎమెరిటస్‌గా పనిచేస్తున్న ప్రణబ్‌ బర్దన్‌ చెప్పారు. ‘భారతదేశంలో చాలా మంది కార్మికులకు సరైన ఉపాధి లేదు. ఆరోగ్యవంతులుగా ఉన్న వారు వారంలో గంట సేపు కూడా పనిచేయనప్పుడు ఏం తింటున్నారు? మీరు ఏ పని చేసినా ఉద్యోగంలో ఉన్నట్లేనని చెబుతారు. అసలు ఉపాధి అంటే ఏమిటి?’ అని బర్దన్‌ ప్రశ్నించారు.
వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడం లేదు
గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ మాత్రం పీఎల్‌ఎఫ్‌ఎస్‌ డేటాను వెనకేసుకొస్తోంది. పలు అంతర్జాతీయ సంస్థలు తమ నివేదికలలో ఈ డేటానే ఉపయోగిస్తు న్నాయంటూ సమర్ధించే ప్రయత్నం చేస్తోంది. అయితే నిరుద్యోగ రేటును నిర్ధారించేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతిని ఆర్థికవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. వేతనం లేకుండా ఇంటి పని చేసే వారిని కూడా గతంలో ఉద్యోగిగా పరిగ ణించే వారు. ఇలా చేయడం అంత ర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని అంటూ ఇతర దేశా లతో మన డేటాను ఎలా పోల్చగలమని నిపు ణులు ప్రశ్నించారు. దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో నిరుద్యోగం ఒకటని, ప్రభుత్వ డేటా వాస్తవ పరిస్థితిని ప్రతిబింబి స్తోందని తాను భావించడం లేదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు తెలిపారు. ఉపాధిని కల్పించే విధానాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. తక్కువ ఉపాధిని కల్పించే ఫైనాన్స్‌, ఐటీ రంగాలపై కాకుండా ఉపాధి అవకాశాలు పెంచే తయారీ రంగంపై దృష్టి సారించాలని సూచించారు.
బ్యాంకుల్లో తగ్గిన నియామకాలు
అధికారిక నిరుద్యోగ రేటు కచ్చితత్వంతో ఎలాంటి సమస్య లేదని సర్వేలో భాగస్వాములైన ఆర్థికవేత్తలలో నాలుగో వంతు మంది చెప్పారు. డేటాను పద్ధతి ప్రకారమే రూపొందించినప్పటికీ నిరుద్యోగం విషయంలో ఎదురవుతున్న వాస్తవ సవాళ్లను అర్థం చేసుకోవడంలో విఫలమైందని పలువురు తెలిపారు. భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని చెబుతున్నప్పటికీ అది శ్రామిక శక్తిలో కొత్తగా ప్రవేశించే వారికి ఉపాధి కల్పనకు ఉపకరించడం లేదు. ప్రముఖ ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకుల వార్షిక నివేదికల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో ఆయా బ్యాంకులలో నియామకాలు గణనీయంగా తగ్గిపోయాయి. దేశంలో అతి పెద్ద ప్రైవేటు బ్యాంక్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ గత సంవత్సరం 49,713 మంది నిపుణులను నియమించుకుంది. అంతకుముందు సంవత్సరంలో ఈ సంఖ్య 89,115గా ఉంది. 2022-23లో ఈ బ్యాంక్‌ 85,000 మందిని నియమించింది. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ గత ఆర్థిక సంవత్సరంలో కేవలం 1,770 మంది సిబ్బందిని మాత్రమే తీసుకుంది. 2023-24లో నియమించిన 10,661 మంది, 2022-23లో నియమించిన 8,595 మందితో పోలిస్తే ఇది చాలా తక్కువ. ప్రయివేటు రంగంలో మూడో అతి పెద్ద బ్యాంక్‌ అయిన యాక్సిస్‌ గత ఏడాది 31,674 మందిని నియమించుకోగా అంతకుముందు సంవత్సరంలో 40,724 మందిని తీసుకుంది.
‘వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, ఆటో రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలలో వృద్ధి మందగించింది. అందుకే బ్యాంకులు నూతన నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. విస్తరణ సంగతి అలా ఉంచితే ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయడంతోనే బ్యాంకులు సరిపెడుతున్నాయి’ అని సిబ్బంది నియామక సంస్థ టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సీఈఓ కార్తీక్‌ నారాయణ్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -