Monday, March 9, 2026
E-PAPER
Homeక్రైమ్కన్నకూతుళ్లను చెరువులో నెట్టి చంపిన కిరాతక తండ్రి

కన్నకూతుళ్లను చెరువులో నెట్టి చంపిన కిరాతక తండ్రి

- Advertisement -

– కామారెడ్డిలో కలకలం రేపిన విషాద ఘటన
– పోలీసుల వేగవంతమైన దర్యాప్తులో బయటపడిన నిజం
– నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ 
నవతెలంగాణ –  కామారెడ్డి

కామారెడ్డి పట్టణంలోని ఆర్‌బి నగర్ కాలనీలో కన్నతండ్రే కాలయముడై తన ముగ్గురు పసికందులను చెరువులో నెట్టి హతమార్చిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసును కామారెడ్డి పోలీసులు వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయాలను జిల్లా అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కామారెడ్డి పట్టణానికి చెందిన ఇస్మాయిల్ రాజ్ షేక్ భార్య షబీన బేగం మార్చి 6న ఉదయం 11 గంటల నుంచి తన ముగ్గురు కుమార్తెలు కనిపించడం లేదని కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు.

అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు ఒకేసారి కనిపించకుండా పోవడంతో పట్టణంలో కలకలం రేగింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర  ఆదేశాల మేరకు ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా పిల్లల తండ్రి ఇస్మాయిల్ రాజ్ షేక్ ప్రవర్తనపై అనుమానం కలగడంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడిందన్నారు. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయిన ఇస్మాయిల్ రాజ్ షేక్ చెడు అలవాట్ల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. కుటుంబ పోషణ భారంగా భావించి తన ముగ్గురు కుమార్తెలను హతమార్చాలని ముందుగానే పథకం వేసుకున్నాడు.

మార్చి 6 న ఉదయం పిల్లలకు స్నాక్స్ కొనిస్తానని చెప్పి తన ఆటోలో కామారెడ్డిలోని పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కొంతసేపు పిల్లలతో గడిపిన తర్వాత ఎవరూ లేని సమయంలో ఒక్కొక్కరిగా సిఫత్ బేగమ్ (8), అయ్యద్ (6), మరియమ్ (5) లను చెరువులోకి నెట్టివేశాడు. వారు మునిగిపోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం ఇంటికి వెళ్లి ఏమీ తెలియనట్లుగా నటించాడు. పోలీసుల విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో చివరకు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. పిల్లల ఆధార్ కార్డులను చెరువు వద్ద రాళ్ల మధ్య పడేసినట్లు  తెలిపాడు.

అనంతరం పోలీసులు అతడిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన కామారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ నరహరి, రూరల్ ఇన్స్పెక్టర్ రామన్, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు ఏఎస్పీ తెలిపారు. ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, నేరం చేసిన వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఎస్పీ హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -