– దూబె, జైస్వాల్ ధనాధన్
– రెండో టీ20లో భారత్ గెలుపు
– 2-0తో టీ20 సిరీస్ కైవసం
నవతెలంగాణ-ఇండోర్
కుర్రాళ్లు కొట్టేశారు. యువ బ్యాటర్లు శివం దూబె (63 నాటౌట్, 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (68, 34 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) ధనాధన్ అర్థ సెంచరీలతో చెలరేగారు. లెఫ్డ్ హ్యాండ్ బ్యాటర్లు ఇద్దరూ విధ్వంసక ఇన్నింగ్స్‌లతో కదం తొక్కటంతో అఫ్గనిస్థాన్‌తో రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యాన్ని టీమ్ ఇండియా 15.4 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ ఛేదించింది. విరాట్ కోహ్లి (29, 16 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్థాన్ 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. గుల్బాదిన్ నయిబ్ (57, 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), నజీబుల్లా జద్రాన్ (23, 21 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. ఈ విజయంతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ 2-0తో భారత్ వశమైంది. నామమాత్రపు మూడో టీ20 బుధవారం బెంగళూర్‌లో జరుగనుంది.
దంచికొట్టారు : 173 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఊదేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (0) వరుసగా రెండో మ్యాచ్‌లో డకౌట్‌గా నిష్క్రమించినా.. ఛేదనపై ఎటువంటి ప్రభావం పడలేదు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 27 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. మరో ఎండ్‌లో కోహ్లి ఆకట్టుకున్నాడు. తనదైన శైలిలో బౌండరీలు బాదాడు. నవీన్ ఉల్ హాక్‌కు కోహ్లి వికెట్ కోల్పోయినా.. శివం దూబె రాకతో ఇన్నింగ్స్ వేగం పుంజుకుంది. మహ్మద్ నబి ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు సంధించిన దూబె.. స్కోరు బోర్డుకు రాకెట్ స్పీడ్ జోడించాడు. ఓ ఎండ్‌లో దూబె, మరో ఎండ్‌లో జైస్వాల్ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించగా అఫ్గాన్ బౌలర్లు బేజార్ అయ్యారు. శివం దూబె 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 22 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. దూబెకు ఇది వరుసగా రెండో అర్థ సెంచరీ ఇన్నింగ్స్ కావటం విశేషం. జితేశ్ శర్మ (0) నిరాశపరిచినా.. రింకూ సింగ్ (9 నాటౌట్) జతగా శివం దూబె లాంఛనం ముగించాడు. 15.4 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఊదేసింది.
స్కోరు వివరాలు :
అఫ్గనిస్థాన్ ఇన్నింగ్స్ : 172/10 (గుల్బాదిన్ నయిబ్ 57, నజీబుల్లా 23, అర్షదీప్ సింగ్ 3/32)
భారత్ ఇన్నింగ్స్ : 173/4 (యశస్వి జైస్వాల్ 68, శివం దూబె 63, కోహ్లి 29, కరీం జనత్ 2/3)