నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరభారత్ ఆకస్మికంగా సంభవించిన వరదలకు..అక్రమంగా చెట్లను నరికివేయడమే కారణమని సుప్రీంకోర్టు పేర్కొంది.కొండ ప్రాంతాల్లో పర్యావరణ క్షీణతపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తరభారతంలో నమోదవుతున్న వరస విపత్తులపై ఆందోళన వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) BR గవాయ్ ఇలా వ్యాఖ్యానించారు.
‘ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లలో సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలు మనం చూశాం. మీడియాలో వస్తున్న అనేక కథనాలు, వీడియోల్లో వరద నీటి ప్రవాహంతో పాటుగా పెద్ద ఎత్తున్న కలపదుంగలు కొట్టుకొచ్చాయి. ఆ ప్రాంతాల్లో చెట్లను విస్తృతంగా నరికివేయడం వల్లే ఇదంతా జరిగినట్లు కనిపిస్తోందని’ అన్నారు.
ఈ అంశంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీం కోర్టు దీనిని తీవ్రమైన సమస్యగా అభివర్ణించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా, వరద నీటిలో తేలుతున్న చెట్ల దుంగల వీడియోలను పరిశీలించి మూలకారణాలపై నివేదిక అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.