Sunday, June 15, 2025
E-PAPER
Homeమానవినాన్నంటే ఒక ధైర్యం

నాన్నంటే ఒక ధైర్యం

- Advertisement -

నాన్నంటే ఒక భరోసా.. నడక నేర్పిన వాడు నాన్న. నడవడికను సరిదిద్దే వాడు నాన్న.. గుర్రంలా మారి ఆడించేవాడు నాన్న.. తన భుజాల మీద నుంచి లోకం చూపేవాడు నాన్న.. మన ఓటమిలో వెన్నంటే ఉండేవాడు నాన్న.. మన గెలుపులో తన గెలుపును చూసుకొని మురిసే వాడు నాన్న.. నాన్నని ప్రతి ఒక్కరూ ప్రేమించాలి. ఎందుకంటే పిల్లల ముఖంలో చిరునవ్వు చూడడం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసేది నాన్నే కాబట్టి. నాన్న అంటే బంధం మాత్రమే కాదు, నాన్న అంటే బలం, బాధ్యత. ఈ రోజు ఫాదర్స్‌ డే సందర్భంగా నాన్నతో జ్ఞాపకాలు…
నాన్న కోప్పడుతుంటే ప్రశాంతత తెలియదు అనుకున్నా, కళ్లెర్ర చేస్తుంటే కాటిన్య హృదయం అనుకున్నా, మౌనంగా ఉంటే మాటలే ఇష్టం లేదనుకున్నా, ఆజ్ఞలు వేస్తుంటే నేనేమైనా బానిసనా అని బాధపడ్డా.. నాకు ఇప్పుడే తెలుస్తుంది వీటన్నిటికీ మూల సూత్రం ఒకటి ఉందని.. అదే మా పైన అమితమైన ప్రేమ. మా బాగు కోసమే మీ తపన ఆరాటం అని. నాన్న నువ్వు లేని ఈ జీవితం శూన్యం అనిపిస్తోంది. ప్రతిక్షణం నాకోసం నువ్వు పడిన తపన, నువ్వు చూపిన ప్రేమ గుర్తుకువస్తోంది. అమ్మా రాణి అని పిలిచే నీ పిలుపు నా చెవుల్లో మారుమోగుతోంది. మళ్లీ అవకాశం దొరికితే నీ ఒడిలోనే ఆడుకోవాలని, నీ భుజాలపై ఎక్కి లోకాన్ని చూడాలని, ఏన్నో విషయాలు నీతో పంచుకోవాలని ఉంది నాన్న. మరి తిరిగి వస్తావు కదూ..
– పాలపర్తి సంధ్యా రాణి (రాణి)

క్రమశిక్షణకు మారు పేరు నాన్న
మా నాన్న కె.పి. శర్మ. ఎల్‌.ఐ.సి శర్మగా చాలా మంది గుర్తుపడతారు. మేము నలుగురబ్బాయిలు, నలుగురమ్మాయిలం. నేను అందరిలోకీ చిన్నదాన్ని. నాన్నను తలచుకోగానే గుర్తుకొచ్చే రెండు లక్షణాలు క్రమశిక్షణ, సమయపాలన. అలాగే ఉద్యోగరీత్యా ఎన్ని వూళ్లకి బదిలీ అయినా వెళ్లిపోయేవారే తప్ప, నాకు గంపెడు సంసారం ఉంది, పిల్లల చదువులు పాడవుతాయి అనేవారు కాదు. ఆ ఊళ్లన్నీ నాన్నతో పాటు మేం కూడా తిరిగేవాళ్లం. మేము నాన్నని ‘అయ్యా’ అని పిలిచేవాళ్లం. రోజూ రాత్రి మాతో భోజనం చేస్తూ కబుర్లు చెప్పడమంటే నాన్నకు చాలా ఇష్టం. భోజనం చెయ్యాలంటే పుస్తకం చదవాల్సిందే. అందరం కలిసి తింటూ, ఆ రోజు ఎవరి దినచర్య ఎలా జరిగిందో తెలుసుకునేవారు. అలాగే వారాంతంలో మాతో రమ్మీ ఆడడం. మేమంతా కుమ్మక్కై నాన్నని ఓడించిన సందర్భాలూ ఉన్నాయి. అది తెలిసినా నవ్వి ఊరుకునేవారు. ఏ రోజూ మమ్మల్ని తిట్టడం, కొట్టడం, ఆడపిల్ల, మగపిల్లవాడు అనే తేడా చూపడం నాన్న చెయ్యలేదు. అమ్మ అసలే చెయ్యలేదు. అలాగే తన ఆఫీసులో వారిని పండగ భోజనాలకు పిలిచేవాళ్లు. నాన్న దగ్గర బంట్రోతు ముస్లిం. కారు తుడిచే వ్యక్తి క్రైస్తవుడు. అందరికీ భోజనాలు అమ్మతో సహా మేమూ వడ్డించేవాళ్లం. మా ఇంట్లో కులం, మతం ప్రస్తావన ఎప్పుడూ రాకపోవడానికి ముఖ్య కారణం మా నాన్నే. అలా అని ఆయనేమీ కమ్యూనిస్టు కాదు. ఏ సామాజిక ఉద్యమాలతోనూ ఆయనకు సంబంధం లేదు. నాన్నకు ఇష్టమైన క్రికెట్‌, టెన్నిస్‌ పిచ్చి మా అందరికీ అంటించారు. అలాగే సినిమాలు కూడా నాన్న వల్ల అబ్బిన అభిరుచులే. నేను బిఎ లో ఉండగా ఉన్నత చదువులకు పంపలేక ఎందుకైనా మంచిదని స్టెనోగ్రఫీ నేర్చుకో అని చెప్పారు. అలా బియ్యేతో పాటే టైపు, షార్ట్‌హండ్‌ సర్టిఫికెట్‌లు తెచ్చుకున్నాను. ఆఖరి ముగ్గురు ఆడపిల్లలతో ఆయనకు స్నేహం ఎక్కువ. తన మనసులోని అసంతృప్తులను, తన సమస్యలను ఆయన పంచుకున్నది మాతోనే. నేను మొదటి కాన్పుతర్వాత బాలింతరాలిగా ఉన్నపుడు మూడో నెల వచ్చేసరికి, మరో రెండు రోజుల్లో అత్తారింటికి వెళ్దామని అనుకున్నాను. నాన్న హటాత్తుగ వద్దన్నారు. ‘మరో నెల ఉండు. అయిదో నెల్లో పంపుతా. ఇప్పుడు నిన్ను పంపాలని లేదు’ అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. నాన్న అలా సెంటిమెంటుతో ఎప్పుడూ మాట్లాడరు. నాతో ఈ మాట అన్న 15 రోజులకు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఇంగ్లీషు భాషని, హాలీవుడ్‌ సినిమాలని, తెలుగు పద్యాలని, శాస్త్రీయసంగీతాన్ని, హిందీ పాటలని, ప్రేమిస్తూ, తనకిష్టమైన రీతిలో జీవించిన నాన్న గుర్తొచ్చినపుడల్లా ఆ ఠీవి, ఆ చక్కని దరహాసం, తీర్చిదిద్దిన ముక్కు, కారు నడుపుతున్నపుడు ఇంగ్లీషు సినిమా హీరోలా కనిపించే షోకును మళ్లీ నా మనోనేత్రంతో చూస్తాను. పనిగట్టుకుని నేర్పించకుండానే మాకు చక్కని సంస్కారాన్ని నేర్పిన ఆయన స్వభావానికి మరోసారి ముగ్ధురాలినవుతాను.
-ప్రొఫెసర్‌ మృణాళిని

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -