– బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై పార్టీల వ్యూహం
– నితీశ్ సర్కార్‌పై గుర్రమంటున్న మైనార్టీలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దళితుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఎన్నడూలేని విధంగా అంబేద్కర్ చిత్రపటాలు, విగ్రహాలవైపు రాజకీయ పార్టీలు దౌడుతీస్తున్నాయి. దళితులంటే ఎనలేని ప్రేమను ఒలక బోస్తున్నాయి. మరోవైపు అధికారం దగ్గరికి వచ్చినట్టే వచ్చి చేజారటంతో ఈ సారైనా గద్దెనెక్కాలని ఆర్జేడీ ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ, బీహార్‌లోని నితీశ్ సర్కార్‌ను టార్గెట్ చేయటంతో రాజకీయం మరింత వేడెక్కుతోంది. అయితే ఎన్డీఏ కూటమిలోని నితీశ్ సర్కార్ మాత్రం మోడీకి తానా..అంటే తందానా అనటం బీహార్ ఓటర్లకు మింగుడు పడటం లేదు.
దర్బంగా : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి. ఇక్కడ ముస్లింలు, దళితుల ఓట్లే కీలకంగా మారటంతో..రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ సంకీర్ణ పార్టీ అయిన జేడీయూ పార్టీ అధినేత, సీఎర నితీశ్ సర్కార్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా స్థానిక ఓటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నితీశ్‌కు ఉన్న నిరాదరణను పసిగట్టిన బీజేపీ.. పహల్గాం దాడి కన్నా ముందే అగ్రనేతల్ని రంగంలోకి దింపింది. దీన్ని ఓట్లుగా మలుచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
రంగంలో దిగిన కాంగ్రెస్
అక్టోబర్-నవంబర్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ముఖ్యమైన రాష్ట్రం బీహార్ కావటంతో..గెలుపు బాధ్యతను రాహుల్ తన భుజాలపై వేసుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. గత ఐదు నెలల్లోనే రాహుల్ గాంధీ బీహార్‌లో నాలుగుసార్లు పర్యటించారు. జాతీయ జనాభా లెక్కలతో పాటు కుల ఆధారిత జనాభా లెక్కలను నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రాహుల్ సందర్శించారు. తరచుగా ఆయన బీహార్‌లో పర్యటిస్తున్న తీరుతో ఈసారి కాంగ్రెస్ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)తో కలిసి దూకుడుగా ఎన్నికల వ్యూహాన్ని అనుసరించబోతోందని స్పష్టమైన సంకేతాలిస్తున్నాయి.
దళిత సమాజానికి చెందిన సుశీల్ పాసినిని బీహార్ సహ-ఇన్‌చార్జిగా కూడా పార్టీ నియమించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, మొదటిసారిగా, కాంగ్రెస్ పార్టీ ప్రముఖ పాసి నాయకుడు జగ్లాల్ చౌదరి 130వ జయంతి జరుపుకుంది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. పార్టీ నిర్మాణంలో చేసిన ఉన్నత స్థాయి మార్పులు , రాష్ట్రంలోని దళిత సమాజం కోసం నిర్వహించిన కార్యక్రమాలు కాంగ్రెస్ తన సాంప్రదాయ దళిత ఓటు బ్యాంకును తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నట్టు సూచిస్తున్నాయి. బీహార్‌లో దళితుల జనాభా దాదాపు 19 శాతం. ఒకప్పుడు దళితులు కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకుగా ఉండేవారు. కానీ 2005 తర్వాత నితీశ్ కుమార్ పార్టీ అయిన జేడీయూ వైపు మొగ్గు చూపారు. బీహార్ శాసనసభలోని 243 స్థానాలు ఉండగా.. 38 స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు , 2 స్థానాలు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడ్డాయి.
బీహార్‌లో కాంగ్రెస్ గ్రాఫ్..
గత మూడు దశాబ్దాలుగా.. బీహార్‌లో కాంగ్రెస్ గ్రాఫ్ దిగజారింది. ఆ పార్టీ ఓట్ల వాటా తగ్గుతూనే ఉంది. ఇది బీహార్‌లో కాంగ్రెస్ దాదాపు అంతరించిపోయే దశలో ఉన్నదని సూచిస్తుంది.
సంవత్సరం ఓట్ల శాతం
1990 24.78
1995 16.30
2000 11.06
2005 6.09
2010 8.37
2015 6.7
2020 9.48
ఈ గణాంకాలను పరిశీలిస్తే… 2005లో నితీశ్ కుమార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ఓట్ల వాటా నిరంతరం తగ్గుతూ వచ్చింది. ఆ పార్టీ రెండంకెల ఓట్ల శాతాన్ని కూడా చేరుకోలేకపోయింది. అయితే, ఈసారి రాహుల్ గాంధీ దళిత సమాజాన్ని చేరుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ స్థానాన్ని బలోపేతం చేయడానికి తన సాంప్రదాయ ఓటు బ్యాంకును మళ్ళీ ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా.. దర్బంగాలోని అంబేద్కర్ హాస్టల్‌లో ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ విద్యార్థులతో సమావేశమయ్యారు. అక్కడ ఆయన ‘శిక్ష న్యారు సంవాద్’ ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే, ఈ ప్రదేశంలో ఈ కార్యక్రమానికి స్థానిక యంత్రాంగం అనుమతి నిరాకరించింది. ధిక్కరించి హాస్టల్‌లో సమావేశం నిర్వహించినందుకు రాహుల్‌పై నితీశ్ సర్కార్ కేసులు పెట్టింది. బీహార్‌లోని ముక్కోణపు పోటీని తలపిస్తోంది. ఇటు బీజేపీ, అటు జేడీయూ ,మరోవైపు ఆర్జేడీతో రాహుల్ రాజకీయ చదరంగంలో కనిపిస్తున్నా..మరికొద్ది రోజుల్లో బీహార్ రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే..
రాహుల్ గాంధీ డిమాండ్లు
కేంద్ర ప్రభుత్వం కుల గణనను ప్రకటించి, ప్రయివేట్ విద్యాసంస్థల్లో ఎస్సీ-ఎస్టీ కమ్యూనిటీ విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసిన తర్వాత దర్బంగాలో జరిగిన శిక్షా న్యారు సంవాద్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మళ్ళీ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ కింద నిధులు ఇవ్వనందుకు నితీశ్ కుమార్ ప్రభుత్వంపై కూడా ఆయన దాడి చేశారు. ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్ అనేది ఒక రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్‌లో ఒక స్థిర భాగం. ఇది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కేటాయించబడింది. రాహుల్ గాంధీ డిమాండ్ ప్రకారం బలహీన వర్గాలకు బీహార్‌లో ఈ నిధి అందడం లేదు. దీన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకున్నట్టు తెలుస్తోంది.
దళితులతో రాహుల్ అనుబంధం
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే, కాంగ్రెస్ తన వ్యూహాన్ని మార్చుకుంది. ఇప్పుడు ఎస్సీ-ఎస్టీ కమ్యూనిటీని చేరుకోవడానికి దూకుడుగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా… కొన్ని నెలల కిందట అక్కడి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అఖిలేశ్ ప్రసాద్ సింగ్‌ను తొలగించి, దళిత నాయకుడు రాజేశ్ రామ్‌కు ఈ బాధ్యతను అప్పగించింది.
దళితుల ఓట్లే కీలకం..
- Advertisement -
- Advertisement -