Thursday, March 12, 2026
E-PAPER
Homeజాతీయంగెయిన్‌ బిట్‌కాయిన్‌ స్కామ్‌ కేసు డార్విన్‌ లాబ్స్‌ సహ వ్యవస్థాపకుడు అరెస్టు

గెయిన్‌ బిట్‌కాయిన్‌ స్కామ్‌ కేసు డార్విన్‌ లాబ్స్‌ సహ వ్యవస్థాపకుడు అరెస్టు

- Advertisement -

న్యూఢిల్లీ : గెయిన్‌బిట్‌కాయిన్‌ స్కామ్‌ కేసులో డార్విన్‌ లాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహ వ్యవస్థాపకుడు ఆయుష్‌ వర్షనీని సిబిఐ అరెస్టు చేసింది. బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెడితే అధిక రాబడులు వస్తాయనే హామీ ఇచ్చి తరువాత మోసం చేశారని, అలాగే, ఇలా సేకరించిన నిధులను దుర్వినియోగం చేశారని ఈ కేసులో అభియోగాలు ఉన్నాయి. ఇలాంటి అభియోగాలతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని పోలీస్‌ స్టేషన్లలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు ఆధారంగా సిబిఐ ఈ కేసును విచారణ చేస్తోంది. 2023, డిసెంబరు 13న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సిబిఐ ఈ దర్యాప్తు నిర్వహిస్తోంది. బిట్‌కాయిన్‌లో పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఎంక్యాప్‌ అనే క్రిప్టో టోకెన్‌ను, ఇఆర్‌సి-20 అనే స్మార్ట్‌ కాంట్రాక్ట్‌ రూపకల్పన, అభివృద్ధి, విస్తరణలో డార్విన్‌ ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కీలక పాత్ర పోషించిందని సిబిఐ తన విచారణలో గుర్తించింది. దీంతో ఈ సంస్థ సహ వ్యవస్థాపకులు ఆయుష్‌ వర్షిని, సాహిల్‌ బాగ్లా, నికుంజ్‌ జైన్‌లపై సిబిఐ దృష్టి పెట్టింది. వీరిలో నికుంజ్‌ జైన్‌ చీఫ్‌ క్యాపిటల్‌ ఆఫీసర్‌గానూ, ఆయుష్‌ వర్షిని చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌గానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గెయిన్‌బిట్‌కాయిన్‌ అనే మోసపూరిత పథకానికి యావత్తు సాంకేతిక సదుపాయాన్ని కల్పించింది డార్విన్‌ లాబ్స్‌ కీలక పాత్ర పోషించిందని సిబిఐ తెలిపింది. కొంతకాలం నుంచి వర్షిని పరారీలో ఉండటంతో అతని లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. ఈ నెల 9న దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ముంబయిలోని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్టు చేశారు. తరువాత రోజు, అంటే మంగళవారం అతన్ని సిబిఐకి అప్పగించారు. బుధవారం అతన్ని సిబిఐ అరెస్టు చేసింది. 2015లో గెయిన్‌బిట్‌కాయిన్‌ను ప్రారంభించారు. ప్రారంభంలో పెట్టుబడిదారులకు నెలవారీ చెల్లింపులు జరిగేవని, అయితే అవి క్రమంగా ఆలస్యం అయ్యాయని, తరువాత పూర్తిగా చెల్లించడం మానేశారని ఫిర్యాదులు వచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -