నవతెలంగాణ-హైదరాబాద్ : వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడనే కోపంతో తల్లితో కలిసి తండ్రినే హతమార్చిందో కూతురు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఘట్‌కేసర్‌లో జరిగిందీ ఘటన. హత్య అనంతరం ఏమీ తెలియనట్టు సినిమాకు వెళ్లి, అర్ధరాత్రి శవాన్ని చెరువులో పడేసి తమ నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 7న ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్ చెరువులో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. మృతదేహంపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడిని హైదరాబాద్ కవాడిగూడకు చెందిన వడ్లూరి లింగం (45)గా గుర్తించారు. విచారణలో భాగంగా పోలీసులు లింగం భార్య శారద (40), కుమార్తె మనీషా (25)ను ప్రశ్నించారు. కల్లు తాగే అలవాటున్న లింగం అందరితో గొడవపడి ఈ నెల 6న ఇంటి నుంచి వెళ్లిపోయాడని వారు తెలిపారు. వారి మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు, చెరువు సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా అసలు నిజం బయటపడింది.
పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడి కుమార్తె మనీషాకు వివాహమైనప్పటికీ, భర్త స్నేహితుడైన మహ్మద్ జావీద్ (24)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలియడంతో భర్త ఆమెను వదిలేశాడు. దీంతో మనీషా తన ప్రియుడితో కలిసి మౌలాలీలో నివసిస్తోంది. ఈ బంధాన్ని తండ్రి లింగం తీవ్రంగా వ్యతిరేకించాడు. మరోవైపు, భర్త తనను కూడా అనుమానించి వేధిస్తున్నట్టు శారద కుమార్తెతో చెప్పుకుని బాధపడింది. దీంతో తండ్రిని అడ్డు తొలగించుకోవాలని మనీషా నిర్ణయించుకుంది.
పథకం ప్రకారం ఈ నెల 5న నిద్రమాత్రలను తల్లికి ఇవ్వగా, ఆమె వాటిని కల్లులో కలిపి లింగంకు ఇచ్చింది. అతను గాఢ నిద్రలోకి జారుకున్నాక, ప్రియుడితో కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు ముగ్గురూ కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్లారు. అనంతరం ఓ క్యాబ్ బుక్ చేసి, లింగం మృతదేహాన్ని కారులో ఎక్కించారు. డ్రైవర్‌కు అనుమానం రాగా, అతను ఎక్కువగా కల్లు తాగి మత్తులో ఉన్నాడని నమ్మించారు. ఎదులాబాద్ చెరువు వద్దకు మృతదేహాన్ని తీసుకెళ్లి నీటిలో పడేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నేరాన్ని నిర్ధారించిన పోలీసులు.. శారద, మనీషా, జావీద్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.