Sunday, July 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండెడ్‌ స్టోరేజ్‌

డెడ్‌ స్టోరేజ్‌

- Advertisement -

నిండని ప్రధాన జలాశయాలు
ఉమ్మడి కరీంనగర్‌లో
లోటు వర్షపాతం
భారీగా సాగు లక్ష్యాలు..
క్షేత్రస్థాయిలో పరిస్థితి ప్రశ్నార్థకం
కన్నెపల్లి నుంచి ఎత్తిపోయాల్సిందే…
నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెల రోజులు దాటినా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో అనేక ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులు డెడ్‌ స్టోరేజీకి చేరుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్‌లో లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సిన తరుణంలో పొలాలు బీటలు వారుతున్నాయి. భారీగా ఉన్న సాగు లక్ష్యాలు తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో మేడిగడ్డ బ్యారేజీ వద్ద పిల్లర్ల మరమ్మతు వదిలేసినా.. కన్నెపల్లి పంపుహౌజ్‌ వద్ద ఎత్తిపోతలను పరిశీలించాలని రైతులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
మేడిగడ్డ బ్యారేజీ వద్ద పిల్లర్లు కుంగకముందు గతంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రైతన్నలకు అండగా నిలిచింది. కానీ, మేడిగడ్డ బ్యారేజీ వద్ద పిల్లర్‌ కుంగిన ఘటనతో ఈ ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలు రెండేండ్లుగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంపుహౌజ్‌ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశాన్ని పరిశీలించాలన్న డిమాండ్లు పెరిగాయి. ప్రస్తుతం కన్నెపల్లి వద్ద 96 మీటర్ల మేర ప్రవాహం కొనసాగుతుంది. 93.5 మీటర్ల నుంచి 94.5 మీటర్ల ప్రవాహం ఉంటేనే పంపులను ప్రారంభించే అవకాశం ఉండటంతో ఈ బారాజ్‌ నుంచి రోజుకు 20 వేల క్యూసెక్కులకుపైగా అంటే, రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే వెసులుబాటు ఉంది. ఈ ఎత్తిపోతలకు నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఎన్‌డీఏ కూడా కన్నెపల్లి నుంచి అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోయడానికి ఎక్కడా అభ్యంతరం తెలపలేదు. ఈ నీటిని ఎల్లంపల్లి, మధ్యమానేరు, దిగువమానేరు, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ రిజర్వాయర్లతోపాటు ఎగువ మానేరు వరకు ఎత్తిపోసే అవకాశం ఉందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అంటున్నారు. ఎస్సారెస్పీ పునర్జీవం ద్వారా వరద కాలువను నిండుగా నింపుకోవడంతోపాటు ఈ పరిధిలోని అన్ని చెరువులనూ నింపడానికి పుష్కలమైన అవకాశాలున్నాయి.
ఉమ్మడి కరీంనగర్‌ అంతటా లోటువర్షమే!
వర్షాభావ పరిస్థితులు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. మొత్తం 63 మండలాలకుగాను 52 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లాలో (-53శాతం), కరీంనగర్‌ జిల్లాలో (-34శాతం), జగిత్యాల జిల్లాలో (-34శాతం), రాజన్న సిరిసిల్ల జిల్లాలో (-32శాతం)గా ఉంది. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలంలోనే అత్యధికంగా 65శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, రామగుండం 61శాతం, సుల్తానాబాద్‌ 60శాతం, కరీంనగర్‌ రూరల్‌లో 59శాతం వంటి అనేక మండలాలు 50శాతానికిపైగా లోటుతో అల్లాడుతున్నాయి. ఈ ప్రభావంతో జిల్లాలోని 1,376 చెరువులు, కుంటలు నీరు లేక బోసిపోతున్నాయి. వాగులు, వంకలు పారకపోవడంతో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి.
భారీ సాగు లక్ష్యాలు..
క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ శాఖ లక్ష్యాలకు పూర్తి విరుద్ధంగా, నీటి ఎద్దడి కారణంగా పంటల సాగు గణనీయంగా తగ్గిపోయింది. జగిత్యాల జిల్లాలో 3.10 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా వేయగా, ఇప్పటివరకు 27.82శాతం మాత్రమే సాగైంది. కరీంనగర్‌ జిల్లాలో 3.4 లక్షల ఎకరాలకుగాను కేవలం 75,715 ఎకరాల్లోనే సాగు చేపట్టారు. పొలాల్లో వేసిన నాట్లు నీళ్లు లేక నారుమడుల్లోనే ముదిరిపోతున్నాయి. రైతులు పెట్టిన పెట్టుబడి నీటిపాలయ్యే ప్రమాదం ఏర్పడింది. దీనికితోడు పొడి వాతావరణం కారణంగా పత్తిలో రసం పీల్చే పురుగులు, మొక్కజొన్నలో కత్తెర పురుగు వంటి చీడపీడల బెడద కూడా మొదలైంది. పంటల బీమా పథకంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడం అన్నదాతలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
అడుగంటిన జలాశయాలు
ఉమ్మడి జిల్లాకు సాగు, తాగునీటిని అందించే కీలక జలాశయాలు నీటి నిల్వలు లేక కళావిహీనంగా మారాయి. శ్రీపాద ఎల్లంపల్లి, మధ్యమానేరు, దిగువమానేరు జలాశయాల్లో నీరు డెడ్‌ స్టోరేజీకి పడిపోయింది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీరాంసాగర్‌లోకి నామమాత్రపు ఇన్‌ఫ్లో వస్తున్నప్పటికీ, అది లక్షల ఎకరాల ఆయకట్టుకు ఏ మాత్రమూ సరిపోదు.
ఈ గణాంకాలు జిల్లాలోని సాగునీటి భద్రత ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో స్పష్టం చేస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే తప్ప ఈ జలాశయాలకు జలకళ రావడం అసాధ్యం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -