నవతెలంగాణ-హైదరాబాద్: యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటోన్న కేరళ నర్సు నిమిష ప్రియ కు కాస్త ఊరట లభించినట్లు తెలుస్తోంది. ఆమె మరణశిక్ష అమలును యెమెన్ వాయిదా వేసినట్లు భారత విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి.
నిమిష ప్రియ మరణ శిక్షను నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం, కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మరణ శిక్షను తప్పించేందుకు ఉన్న ఒక్క అవకాశం బాధిత కుటుంబానికి ‘బ్లడ్ మనీ’ ఇవ్వడం. ఈ నేపథ్యంలోనే బాధిత కుటుంబంతో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చివరి ప్రయత్నంగా భారత మత గురువుతో రాయబారం పంపినట్లు తెలిసింది. యెమెన్ లో బాధిత కుటుంబంతో మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రియ తరపు న్యాయవాది తాజాగా వెల్లడించారు.
కాగా, 37 ఏళ్ల నిమిష ప్రియ తన బిజినెస్ పార్ట్‌నర్, యెమెన్ దేశస్థుడు తలాల్ అబ్దో మెహదీని మరొక నర్సు సాయంతో మత్తు మందు ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇద్దరూ అతని శరీరాన్ని ముక్కుల చేసి, అవశేషాలను భూగర్భ ట్యాంక్‌లో పడేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై కోర్టులో ఆమె సవాల్ చేసింది. కానీ కోర్టు ఆమె అప్పీళ్లు తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆమె సనా సెంట్రల్ జైల్లో ఉంది.