అదే దారిలో జర్నలిజం
సోషల్ మీడియా బూతు మీడియాగా మారింది :
విలీనం-విభజన పుస్తకావిష్కరణ సభలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాజకీయాల్లో విలువలు నానాటికి దిగజారి పోయాయని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ పాత్రికేయులు ఇనగంటి వెంకట్రావు రాసిన ‘విలీనం-విభజన’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై పుస్తకావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయాలు కులం, మతం, డబ్బుల చుట్టూ తిరుగుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో వచ్చిన ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా మారిందని వ్యాఖ్యానించా రు. ఇలాంటి వారిని ఓటు అనే ఆయుధంతో తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీన్ని అడుగడుగునా అడ్డుకోవాల్సిన మీడియా సైతం వారి అడుగు జాడల్లోనే నడుస్తోందని అన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా బూతు మీడియాగా మారిందని వ్యాఖ్యానించారు. పత్రికలు సమాజానికి దర్పణం లాంటివనీ, సమాజంలో ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలని ఆకాంక్షించారు. మనం వ్యూస్ కోసం న్యూస్ చేయకూడదనీ, దానికోసం ఉన్న కాలమ్స్‌లో తమ తమ అభిప్రాయాలు చెప్పొచ్చని పేర్కొన్నారు. భాష విషయంలో రాజకీయ నాయకులు చాలా హుందాగా ప్రవర్తించాలని సూచించారు. తన జీవితంలో రెండు సార్లు కంటతడి పెట్టానని గుర్తుచేసుకున్నారు. ఒకటి తన తల్లి గుర్తుకు వచ్చినప్పుడు… రెండోది పార్లమెంటరీ పార్టీ సమావేశానికి పిలిచి తనను ఉప రాష్ట్రపతిగా చేసినప్పుడని భావోద్వేగానికి గురయ్యారు. తనకు రాజకీయాల నుంచి వైదొలగడం ఇష్టం లేదని తెలిపారు. ఉప రాష్ట్రపతిగా రిటైర్డ్ అయ్యాక యువత కోసం రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విలీనం-విభజన పుస్తకాన్ని నేటితరం యువత తప్పని సరిగా చదవాలని సూచించారు. ఈ పుస్తకం చదివితే నాయకుల పరిపాలన, విజ్ఞానం, వారి గురించి అన్ని విషయాలు తెలుస్తాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ కె. శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత ఇనగంటి వెంకట్రావు, సీనియర్ జర్నలిస్టులు కట్టా శేఖర్ రెడ్డి, బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు.
రాజకీయాల్లో దిగజారుతున్న విలువలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES