నవతెలంగాణ-హైదరాబాద్: దిల్లీ పేలుళ్ల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2023లో ఈ ప్రణాళిక వేసినట్లు బాంబు పేలుడు అనుమానితుడు విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. దిల్లీ పేలుడులో చనిపోయిన సూసైడ్ బాంబర్‌ను ఉమర్ నబీగా గుర్తించిన సంగతి తెలిసిందే. అతడితో సంబంధాలున్న పలువురు అనుమానితులను దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.పేలుడు పదార్థాలు, రిమోట్లు, బాంబు తయారీ పదార్థాలను సేకరిస్తున్నానని అనుమానితుల్లో ఒకడైన డా. ముజమ్మిల్ షకీల్ (Muzammil Shakeel) జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణలో అంగీకరించినట్లు సమాచారం. యూరియా, అమ్మోనియా నైట్రేట్‌ను కొనుగోలు చేయడం తనకు అప్పగించిన పనని చెప్పినట్లు తెలుస్తోంది.
దిల్లీ పేలుళ్ల కుట్రకు ఉగ్ర అనుమానితులే నిధులు సమకూర్చారని, పేలుడు పదార్థాల కొనుగోలుకు రూ.26 లక్షలు సేకరించారని సదరు వర్గాలు వెల్లడించాయి. రూ.6.5 లక్షలు పెట్టి ఏకే-47 రైఫిల్ కొన్నట్లు కూడా ముజమ్మిల్ అంగీకరించాడు. దానిని కశ్మీర్‌కు చెందిన మరో డాక్టర్ అదీల్ రాఠర్ లాకర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. తన హ్యాండ్లర్ పేరు మన్సూర్ అని, ఉమర్ హ్యాండ్లర్ పేరు హషీమ్ అని.. ఆ ఇద్దరు హ్యాండ్లర్లు ఇబ్రహీం అనే వ్యక్తి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తారని ఉగ్ర డాక్టర్ అంగీకరించినట్లు సమాచారం.



