– ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ.
నవతెలంగాణ-కంఠేశ్వర్: సిజెఐ బిఆర్ గవాయి పై జరిగిన దాడికి నిరసనగా ఈ నెల 17న చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందని, దళిత ఆత్మగౌరవ ఉద్యమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ తెలిపారు. దేశ రాజధానిలో అత్యున్నత న్యాయవ్యవస్థగా ఉన్న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మీద దాడి జరిగి నెల రోజులు కావస్తున్న ఇప్పటికీ కేసులు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ నవంబర్ 17న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, డిల్లీలో పెద్ద ఎత్తున దళితుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, ఎంఎస్పి రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగలు అన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల కార్యవర్గ సమావేశం న్యూ అంబేద్కర్ భవన్ లో జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ స్థానంలో ఉన్న దళితుడికే రక్షణ లేకపోతే దేశంలో సామాన్య దళితులకు రక్షణ ఎలా ఉంటుందని అన్నారు. ఈ దాడి జరిగి నెల రోజుల కావస్తున్నా ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడం దారుణమని అన్నారు. జస్టిస్ గవాయ్ స్థానంలో ఉన్నత కులాలకు చెందిన జడ్జీ ఉంటే కేసు నమోదు చేయడంలో ఇలా నిర్లక్ష్యం చేసి ఉండే వారా? అని ప్రశ్నించారు.అందుకే జస్టిస్ బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడి దళితులపైన జరిగిన దాడిగా చూస్తున్నామని అన్నారు.దళితులు ఎంత ఉన్నత స్థానానికి కష్టపడి ఎదిగినా కుల రక్కసి వెంటాడుతుందని అన్నారు.
అందుకే డిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించారు. న్యాయవ్యవస్థ ,జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించుకుండా కుల వివక్షతను పక్షపాతాన్ని చూపాయని అన్నారు.అందుకే గవాయి పై దాడి ఘటనను నిరసిస్తూ జాతీయ స్థాయిలో దళితుల ఆత్మగౌరవ పోరాటం చేపడుతున్నామని అన్నారు.కానీ 12 రోజులుగా ఎదురు చూస్తున్నా నేటికీ న్యాయం జరగలేదని అన్నారు. కనుకనే ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. తక్షణమే దాడి ఘటన మీద కేసు నమోదు చేయాలి.నిందితుడిని అరెస్టు చేసి జైలులో పెట్టాలి.అలాగే ఈ ఘటన మీద సుప్రీం కోర్టు రిటైర్డు జడ్జీ చేత విచారణ జరిపించి దీని వెనుక ఉన్న శక్తులను గుర్తించాలి.ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సహించేది లేదని అన్నారు.చీఫ్ జస్టిస్ గారిపై దాడి విషయంలో న్యాయాన్ని కోరుతూ నవంబర్ 17న ఛలో డిల్లి , దళితుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తామని , ఈ ర్యాలీలో ఆత్మగౌరవంతో జీవించాలని కోరుకునే దళిత ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఇంచార్జి మంథని శామ్యూల్ మాదిగ ఎంఎస్పి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సరికేల పోశెట్టి మాదిగ, ఎంఎస్పి జిల్లా నాయకులు మనికొల్ల గంగాధర్ మాదిగ, మైలారం బాలు మాదిగ, నాగభూషణ్ మాదిగ, ఎం ఈ ఎఫ్ జిల్లా అధ్యక్షులు మారుతి, ట్రీజరరీ శ్రీనివాస్, ఎం ఈ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్, నాంపల్లి, కామారెడ్డి ఎంఎస్పి నాయకులు యాదగిరి మాదిగ, లక్ష్మీ మాదిగ, యమున, సావిత్రి, జిల్లా కమిటీ నాయకులు, వివిధ మండల నాయకులు పాల్గొన్నారు.



