Wednesday, September 24, 2025
E-PAPER
HomeజాతీయంLadakh: రాష్ట్రహోదా డిమాండ్‌...లద్దాఖ్‌లో ఆందోళనలు

Ladakh: రాష్ట్రహోదా డిమాండ్‌…లద్దాఖ్‌లో ఆందోళనలు

- Advertisement -




నవతెలంగాణ ఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో బుధవారం నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్రహోదా డిమాండ్‌ చేస్తూ లేహ్‌ నగరంలో పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్డుపైకి వచ్చారు. వారిని చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసులతో ఘర్షణకు దిగారు. బీజేపీ కార్యాలయానికి, పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ని బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 2019, ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. తర్వాత నుంచి రాష్ట్రహోదా పునరుద్ధరణ కోసం ఎప్పటినుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రహోదా, రాజ్యాంగపరమైన భద్రతలు కల్పించాలన్న డిమాండ్‌తో జనం ఉదయం లేహ్‌ వీధుల్లోకి వచ్చారు.

తర్వాత ఆ నిరసనలు హింసాత్మకంగా మారడంతో రాళ్లు రువ్వడం, బీజేపీ కార్యాలయం, పోలీసు వాహనాలకు నిప్పు పెట్టడం వంటి చర్యలకు పాల్పడ్డారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. అక్కడ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. ప్రజల డిమాండ్లపై చర్చించేందుకు లద్దాఖ్‌ ప్రతినిధులు అక్టోబర్ 6న సమావేశానికి రావాలంటూ కేంద్రం ఆహ్వానించిన సమయంలో ఈ ఆందోళనలు చోటుచేసుకోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. రాష్ట్రహోదా కోసం పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ రెండువారాలుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. లద్దాఖ్‌ను ఆరవ షెడ్యూల్‌ కింద చేర్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలనను అక్కడి ప్రజలు మూడేండ్లుగా నిరసిస్తున్నారు. తమ భూమి, సంస్కృతి, వనరుల పరిరక్షణ కోసం రాజ్యాంగ భద్రత ఉండాలని కోరుతున్నారు. వారి డిమాండ్లపై కేంద్రం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగినా ఆశించిన ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 6న చర్చలకు రావాలని పిలుపు వచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -