Tuesday, January 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంజెరూసలెంలో యూఎన్ఓ కార్యాల‌యం కూల్చివేత‌

జెరూసలెంలో యూఎన్ఓ కార్యాల‌యం కూల్చివేత‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇజ్రాయిల్‌ సైన్యం మంగళవారం తూర్పు జెరూసలెంలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం కూల్చివేతను ప్రారంభించింది. పాలస్తీనియన్లకు మానవతాసంస్థలు అందించే సాయంపై ఇజ్రాయిల్‌ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయిల్‌ సైన్యం తమ సిబ్బంది పరికరాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రధాన కార్యాలయం నుండి వారిని బయటకు నెట్టివేసిందని యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ తన ఎక్స్‌ ఖాతాలో పేర్కొంది.

ఇది యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ మరియు దాని ప్రాంగణంపై జరిగిన అసాధారణ దాడిగా పేర్కొంది. అంతర్జాతీయ చట్టాన్ని మరియు ఐక్యరాజ్యసమితి ప్రత్యేకాధికారం, రక్షణను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని తెలిపింది. యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ పాలస్తీనియన్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, హమాస్‌తో సంబంధాలు కలిగి ఉందని ఇజ్రాయిల్‌ గతంలో ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను యుఎన్‌ తీవ్రంగా ఖండించింది.

ఆసంస్థపై నిషేధం ఉందని, కొత్త చట్టం ద్వారా కూల్చివేతను చేపడుతున్నట్లు ఇజ్రాయిల్‌ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఇది ఒక చారిత్రకమైన రోజు అని మరో ఇజ్రాయిల్‌ మంత్రి వ్యాఖ్యానించారు.

జోర్డాన్‌, లిబియా, సిరియాలతో పాటు గాజా, ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ పాలస్తీనియా శరణార్థులకు ఆరోగ్య భద్రతను అందించడమే కాకుండా వారికోసం పాఠశాలలు, శరణార్థి శిబిరాలను నిర్వహిస్తోంది. 2018లో సంస్థకు ట్రంప్‌ యంత్రాంగం సాయాన్ని నిలిపివేసింది. తూర్పు జెరూసలెంతో పాటు ఇజ్రాయిల్‌లో ఈ సంస్థ కార్యకలాపాలపై నిషేధం విధిస్తూ గతేడాది ఇజ్రాయిల్‌ పార్లమెంట్‌ (నెస్సెట్‌) ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -