Saturday, March 28, 2026
E-PAPER
Homeబీజినెస్కరిగిపోతున్న విదేశీ మారకం నిల్వలు

కరిగిపోతున్న విదేశీ మారకం నిల్వలు

- Advertisement -

– వారంలోనే 11 బిలియన్‌ డాలర్లు ఆవిరి
– రూపాయిపై ఒత్తిడి
ముంబయి :
దేశ ఆర్థిక వ్యవస్థకు, అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులకు అత్యంత కీలకమైన విదేశీ మారక నిల్వలు అమాంతం కరిగిపోతున్నాయి. ఆర్‌బిఐ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 20తో ముగిసిన వారం రోజుల్లోనే ఏకంగా 11.413 బిలియన్‌ డాలర్ల (రూ.1 లక్ష కోట్ల పైగా) నిల్వలు కరిగిపోయి 698.346 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇంతక్రితం వారంలోనూ 7.052 బిలియన్లు హరించుకుపోయి 709.759 బిలియన్లుగా నమోదయ్యాయి. ఫిబ్రవరి 27 నాటికి 728.498 బిలియన్‌ డాలర్లతో ఆల్‌టైం గరిష్టానికి చేరిన నిల్వలు పశ్చిమాసియాలోని యుద్ధంతో అమాంతం పడిపోతున్నాయి. కేవలం రెండు వారాల వ్యవధిలోనే దాదాపు 18 బిలియన్‌ డాలర్లకు పైగా నిల్వలు తగ్గిపోవడంతో దేశ దిగుమతి సామర్థ్యంపై, అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. ఊహించని రీతిలో వరుసగా పతనం కావడం ఆర్థిక నిపుణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

మారకం నిల్వల్లో ప్రధానమైన ఫారిన్‌ కరెన్సీ ఆస్తులు మార్చి 20తో ముగిసిన వారంలో 2.127 బిలియన్‌ డాలర్లు క్షీణించి 557.695 బిలియన్లుగా చోటు చేసుకున్నాయి. బంగారం నిల్వలు 13,495 బిలియన్‌ డాలర్లు తగ్గి 117.186 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) వద్ద ఉన్న స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ 65 మిలియన్‌ డాలర్లు తగ్గి 18.632 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ఐఎంఎఫ్‌ వద్ద భారత రిజర్వ్‌ స్థాయిలు మాత్రం 19 మిలియన్‌ డాలర్లు పెరిగి 4.833 బిలియన్‌ డాలర్లకు చేరింది.

ఈ భారీ పతనానికి ప్రధానంగా బంగారు నిల్వల విలువలో వచ్చిన 13.495 బిలియన్‌ డాలర్ల భారీ కోత కారణమని రిజర్వ్‌ బ్యాంక్‌ గణాంకాలు చెబుతున్నాయి. ఒకవైపు పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో చమురు ధరలు మండిపోతుంటే, మరోవైపు మన వద్ద ఉన్న నిల్వలు ఇలా వేగంగా తగ్గిపోవడం రూపాయి విలువను మరింత పాతాళానికి నెట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే డాలర్‌తో రూపాయి 95 చేరువలో ఆల్‌టైమ్‌ కనిష్టానికి పడిపోగా.. రూపాయిని కాపాడుకోవడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద ఉన్న అస్త్రాలు తగ్గిపోతున్నాయనే సంకేతాలు ఈ గణాంకాలు ఇస్తున్నాయి. విదేశీ మారకం నిల్వల క్షీణత పరిస్థితి కొనసాగితే దిగుమతుల వ్యయం పెరిగి, దేశంలో నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరే అవకాశం ఉంది. విదేశీ నిల్వలలో వేగవంతమైన పతనం గనుక అదుపులోకి రాకపోతే రాబోయే రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -