నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్ర రాజధాని ముంబైలో పెను ప్రమాదం తప్పింది. వడాల డిపో దగ్గర బుధవారం ఉదయం టెస్ట్ రన్ నిర్వహిస్తుండగా మోనో రైలు పట్టాలు తప్పింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైలులోని ఇద్దరు సిబ్బందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
మోనో రైలు సిగ్నలింగ్ ట్రయల్స్ ఉన్నదని, ఈ ఉదయం టెస్ట్ రన్ నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని చెప్పారు. ఘటనలో రైలు పాక్షికంగా దెబ్బతిన్నదని వెల్లడించారు. అయితే మహా ముంబై మెట్రో రైల్ ఆపరేషన్స్ లిమిటెడ్ (Maha Mumbai Metro Rail Operations Limited) ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
సాంకేతిక లోపాలు తలెత్తడంతో సెప్టెంబర్ 20 నుంచి ముంబైలో మోనోరైలు సేవలను నిలిపివేశారు. అప్పటి నుంచే సిస్టమ్ అప్‌గ్రేడేషన్‌లో భాగంగా టెస్ట్ రన్స్ నిర్వహిస్తున్నారు.



