నవతెలంగాణ-హైదరాబాద్: అక్రిడేషన్‌ల విషయంలో జీవో 252తో తమకు అన్యాయం జరుగుతుందని డెస్క్ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో.. వాళ్లకు అన్యాయం జరగకుండా చూడాలంటూ టీడబ్ల్యూజేఎఫ్, డీజేఎఫ్టీ నేతలు మంగళవారం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్లు ఇవ్వాలని, జీవో 252ను సవరించాలని మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే.. స్పోర్ట్స్, కల్చరల్, ఫీచర్ ప్రతినిధులకు అక్రిడేషన్ కార్లు ఇవ్వాలని ఫెడరేషన్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
రిపోర్టర్లతో పాటు డెస్క్ జర్నలిస్టులకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలు పడొద్దు. త్వరలోనే జర్నలిస్టు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తా. ఆ అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తా. జర్నలిస్టులకు ఇబ్బంది లేకుండా జీవో 252ను వివరిస్తామని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా ఫెడరేషన్ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది.



