కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
రాంచీ: పహల్గాం ఉగ్రదాడి వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. ‘సంవిధాన్ బచావో’ పేరుతో రాంచీ వేదికగా నిర్వహించిన సభలో ఖర్గే ఈ విధంగా స్పందించారు. ”దేశంలో పరిస్థితుల గురించి మీ అందరికీ తెలుసు. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి నిఘా వైఫల్యం ఉన్నదని కేంద్రప్రభుత్వం అంగీకరిం చింది. ఇంటెలిజెన్స్‌ను పటిష్ట పరచుకుంటామని వాళ్లే చెప్పారు. దాడికి మూడ్రోజుల ముందే నిఘా సమాచారం ఉందని నాకు తెలిసింది. అలాంట ప్పుడు అక్కడ (పహల్గాంలో) తగినంత భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నా” అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
ఏదేమైనా పహల్గాం దాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌పై ఎటువంటి చర్య తీసుకున్నా ప్రభుత్వా నికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుందని మల్లికార్జున ఖర్గే మరోసారి స్పష్టం చేశారు. పార్టీలకతీతంగా దేశమే తొలి ప్రాధాన్యమన్నారు. రాజకీయ విభేదా లకంటే జాతీయ ఐక్యతే ముఖ్యమన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేసిన ఖర్గే.. ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయడమే మోడీ విధానమని ఆరోపించారు. ఆదివాసీ నేతలను భయపెట్టే ధోరణిని అవలంబించ కూడదని కేంద్రానికి సూచించారు.
పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబానికి రాహుల్ పరామర్శ
పహల్గాం ఉగ్రదాడిలో కన్నుమూసిన నేవీ లెఫ్టినెంట్ వినరు నర్వాల్ కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. హర్యానాలోని నర్వాల్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..భారత్ వైపు మళ్లీ ఎవరూ కన్నెత్తి చూడని విధంగా పహల్గాం దోషులను శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం విషయంలో కేంద్రానికి ప్రతిపక్షం తరఫున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. హర్యానాకు చెందిన వినరు- హిమాన్షి వివాహం ఏప్రిల్ 16న జరిగింది. 19న విందు నిర్వహించారు. అనంతరం భార్యను తీసుకొని జమ్మూకాశ్మీర్‌కు హనీమూన్‌కు వెళ్లారు. తొలుత హనీమూన్ కోసం యూరప్ వెళ్లాలని నిర్ణయించుకున్న ఈ నవ జంట.. తమ వీసాలు రిజెక్ట్ కావడంతో జమ్మూకాశ్మీర్‌కు వచ్చింది. ఉగ్రదాడితో ఆమె కలలన్నీ కల్లలయ్యాయి. పెండ్లై వారం కూడా గడవక ముందే.. కండ్ల ముందే జీవచ్ఛవంలా మారిన భర్తను చూసి హతాశురాలైంది. అంత్యక్రియల సమయంలో భర్తకు సెల్యూట్ చేస్తూ ఆమె రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ బాధించింది. మరోవైపు పహల్గాం దాడి నేపథ్యంలో ఒక వర్గం వారిని టార్గెట్ చేసేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ నర్వాల్ సతీమణి హిమాన్షి విజ్ఞప్తి చేయడంతో సోషల్ మీడియాలో పలువురు ఆమెను ట్రోల్ చేశారు. వారి చర్యలను మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. మహిళ గౌరవాన్ని కాపాడే దిశగా చర్యలు తీసుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది.
ఉగ్రదాడిపై సమాచారమున్నా..భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేయలేదు?
- Advertisement -
- Advertisement -