నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచంలోనే అతి ప్రాచీన పర్వతశ్రేణీ అయిన ఆరావళి పరిసరాల పట్ల కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సోషల్ మీడియా వేదికగా సేవ్ ఆరావళి క్యాంపెయిన్ ఉధృతంగా సాగుతోంది. ఈక్రమంలో శివసేన (UBT) సీనియర్ నేత ఆదిత్య థాకరే బీజేపీపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని మోడీ సర్కార్ భారతీయ పర్యావరణ వ్యవస్థను నాశనం చేయాలని సూచిస్తోందని ధ్వజమెత్తారు. ఆరావళి కొండల ప్రతిపాదిత విధ్వంసాన్ని కేంద్ర పర్యావరణ మంత్రి సమర్థించడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు.
ఈరోజు ఆరావళి, రేపు పశ్చిమ కనుములు, ఆ తర్వాత హిమాలయ శ్రేణులను మైనింగ్ పేరుతో ధ్వంసం చేసే కుట్రలకు బీజేపీ తెరలేపిందని ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఆరావళి కొండలను రక్షించడానికి రాజస్థాన్ మొత్తం వీధుల్లోకి వచ్చిన తీరు నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉందని కొనియాడారు.



