Thursday, October 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందాశరథి విగ్రహ ప్రతిష్టాపన చర్యలు ప్రారంభం

దాశరథి విగ్రహ ప్రతిష్టాపన చర్యలు ప్రారంభం

- Advertisement -

గ్రామ పంచాయతీ గ్రంథాలయాల్లో ఆయన రచనలు : సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి
రవీంద్రభారతిలో దాశరథి శత జయంతి వేడుకలు
కవి అన్నవరం దేవేందర్‌కు దాశరథి సాహితీ పురస్కారం ప్రదానం
నవతెలంగాణ-కల్చరల్‌

మహాకవి దాశరథి కృష్ణమాచార్య విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టించేందుకు కార్యాచరణ ప్రారంభించినట్టు సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో మంగళవారం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దాశరథి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేదికపై కవి అన్నవరం దేవేందర్‌కు దాశరథి సాహితీ పురస్కారాన్ని మంత్రులు బహూకరించారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. తెలంగాణ నేలపై ఉద్యమించిన సాహితీ కిరణం దాశరథి కృష్ణమాచార్యని అన్నారు. దాశరథి రచనలను రాష్ట్ర వ్యాప్తంగా 12,000 పంచాయతీల గ్రంథాలయాల్లో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్రంలోని సాహిత్య ప్రముఖుల రచనల ప్రచారానికి తనకు వార్షికంగా వచ్చే నిధుల నుంచి రూ.కోటి కేటాయిస్తానని ప్రకటించారు. అలాగే, యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు మరో కోటి రూపాయలు వెచ్చిస్తానని తెలిపారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. దాశరథి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని చెప్పారు. ఆయన ప్రభావంతో ఎందరో కవులు సామాజిక స్పృహతో రచనలు చేశారని, అందులో అవార్డు గ్రహీత దేవేందర్‌ ఒకరని చెప్పారు. కవి జయరాజ్‌ మాట్లాడుతూ.. దాశరథి ”అన్నార్తులు అనాథలు” లేని కాలం ఊహించారని, అది ప్రభుత్వం సాకారం చేస్తే దాశరథికి సరైన గుర్తింపని చెప్పారు. కవి యాకూబ్‌ మాట్లాడుతూ.. దాశరథి గీతం ”ఆ చల్లని సముద్ర గర్భంలో..” జాతి జనులు పాడుకునే మంత్రంలా మారిందన్నారు. స్వాగతం పలికిన సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్‌ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. దాశరథి అవార్డుకు ఎంపికైన దేవేందర్‌ తెలంగాణ సాంస్కృతిక జీవన చిత్రాన్ని తన రచనల్లో చూపారని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ, దాశరథి తనయుడు లక్ష్మణ్‌, కుమార్తె ఇందిర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -