నవతెలంగాణ-హైదరాబాద్: లోక్ సభలో వాడీవేడీగా ఆపరేషన్ సిందూర్‌పై రసవత్తరంగా చర్చ సాగుతోంది. చర్చలో భాగంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మొదటగా మాట్లాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్ వాయుసేనలు విజయవంతంగా దూసుకెళ్లి..ఉగ్రవాదుల శిబిరాలను తునాతునకలు చేశాయని వివరించారు.
ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ కీలక ప్రశ్న సంధించారు. ఆపరేషన్ సింధూర్ గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ చాలా విషయాలు చెప్పారని, కానీ పెహల్గామ్‌కు ఎలా ఉగ్రవాదులు వచ్చారో చెప్పలేదన్నారు. బైసారన్ పచ్చికబయళ్లకు ఉగ్రవాదులు ఎలా వచ్చారో ప్రభుత్వం చెప్పలేదన్నారు. వేల మంది టూరిస్టులు ఉండే ప్రాంతానికి ఉగ్రవాదులు ఎలా వచ్చారని అడిగారు. పెహల్గామ్ ఘటనను ఇన్‌ఫర్మేషన్ వార్ అని పేర్కొన్నారు. మతం ఆధారంగా ప్రజల్ని టార్గెట్ చేయవద్దు అని గగోయ్ అన్నారు. ఎలా ఆ అయిదుగురు ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి ఇండియాకు ఎంటర్ అయ్యారని, వాళ్ల ఉద్దేశం ఏంటని ఆయన అడిగారు.
పెహల్గామ్‌లో దాడికి పాల్పడిన అయిదుగురు ఉగ్రవాదులను ఎందుకు పట్టుకోలేదని ఆయన ప్రశ్నించారు. వంద రోజులు దాటినా వాళ్లను ఎందుకు బంధించలేదన్నారు. ప్రభుత్వం వద్ద దానిపై సమాధానం లేదన్నారు. మీవద్ద డ్రోన్లు, పెగాసస్, శాటిలైట్లు ఉన్నాయని, కానీ ఆ ఉగ్రవాదులను మీరు పట్టుకోలేకపోయారని కాంగ్రెస్ నేత అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేశారని, కశ్మీర్ లోయకు పర్యాటకులను ఆహ్వానించారు, కానీ పెహల్గామ్ అటాక్ సమయంలో వాళ్లు నిస్సహాయులుగా ఉండిపోయినట్లు ఆయన ఆరోపించారు. పెహల్గామ్ ఉగ్రదాడికి కేంద్ర మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలన్నారు. దీనికి లెఫ్టినెంట్ గవర్నర్‌ను బలి చేయరాదు అని అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అత్యంత భయంకరమైన దాడి జరిగిందని గగోయ్ ఆరోపించారు. రఫేల్ యుద్ధ విమానాల కోల్పోయిన అంశంపై త్రివిధ దళాధిపతి అనిల్ చౌహాన్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ అంశాన్ని ఆయన గుర్తు చేశారు. పాకిస్థాన్, భారత్ మధ్య కాల్పుల విరమణ తన వల్లే జరిగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటి వరకు 26 సార్లు వెల్లడించారని, దీనిపై నిజం ఏంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పెహల్గామ్ ఉగ్రదాడి, సిందూర్ ఆపరేషన్ తర్వాత జరిగిన అంతర్జాతీయ దౌత్యం గురించి వెల్లడించాలని గగోయ్ అడిగారు. పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ రుణం అందకుండా ఇండియా ఎందుకు అడ్డుకోలేదన్నారు. పాకిస్థాన్‌తో ఎందుకు కాల్పుల విరమణకు అంగీకరించారో ప్రధాని మోదీ చెప్పాలని గగోయ్ డిమాండ్ చేశారు.